ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించేందుకు కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం పేరు వైఎస్సార్ జలకళ. ఎన్నికల ముందు పాదయాత్రలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. గ్రామాల్లో రైతులు బోర్డు వేయడానికి లక్షల్లో డబ్బులు ఖర్చు చేసి అప్పులపాలవుతుంటారు. రైతులకు ఇలాంటి ఇబ్బందులు తొలగించి ఉచితంగా ప్రభుత్వమే బోర్లు వేయించడమే ఈ పథకం లక్ష్యం.
ఈ నాలుగేళ్లలో రూ.2,340 కోట్లు ఖర్చు చేసి అర్హులైన రైతులకు 2 లక్షల బోర్లు ఉచితంగా వేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బోర్ల ద్వారా రాష్ట్రంలో కొత్తగా దాదాపు 5 లక్షల ఎకరాల వ్యవసాయ భూమికి సాగునీరు అందుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సెప్టెంబర్ 28న ఈ పథకాన్ని జగన్ ప్రారంభించారు. ఉచితంగా బోర్లు వేయడానికి ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక బోరు రిగ్గును ఏర్పాటు చేసింది.
ఉచిత బోరు వేయించుకోవాలి అనుకున్న రైతులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. www.ysrjalakala.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోలేని వారు గ్రామ వాలంటీర్ల సహకారంతో గ్రామ సచివాలయాల్లో కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
ఐదు ఎకరాల లోపు భూమి ఉండి, ఇప్పటివరకు బోర్ గానీ బావి కానీ లేని రైతులు ఈ పథకం కింద ఉచిత బోర్లు వేయించుకోవడానికి అర్హులు. అయితే, రైతుకు ఒకేచోట రెండున్నర ఎకరాల భూమి ఉండాలి. అలా లేకపోతే రెండున్నర ఎకరాల నుంచి ఐదు ఎకరాల వరకు ఒకే చోట భూమి ఉన్న రైతులను ఒక బృందంగా ఏర్పాటుచేసి అందరికీ కలిపి ఒకే బోర్ మంజూరు చేస్తారు. అర్హత కలిగిన రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ జత చేసి దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్లో, గ్రామ వాలంటీర్ల ద్వారా గ్రామ సచివాలయాల్లో రైతులు సమర్పించిన దరకాస్తులను ముందుగా గ్రామ వీఆర్వో పరిశీలిస్తారు. అక్కడి నుంచి డ్వామా ఏపీడీకి పంపిస్తారు. ఈ దరఖాస్తును డ్వామా ఏపీడీ జియాలజిస్టుకు పంపిస్తారు. జియాలజిస్టు సదరు రైతు భూమిలో ఎక్కడ బోర్ వేస్తే నీళ్లు వస్తాయనేది సర్వే జరిపి నివేదిక ఇస్తారు. జియాలజిస్టు నుంచి అనుమతి రాగానే బోరు వేయడానికి డ్వామా ఏపీడీ పరిపాలనా అనుమతి మంజూరు చేస్తారు.
ఒకసారి పరిపాలనా అనుమతి వచ్చిన తర్వాత కాంట్రాక్టరు బోరుబావి తవ్వుతారు. ఒకవేళ మొదటిసారి బోర్వెల్ విఫలమైనా, నీళ్లు పడకపోయినా రెండోసారి కూడా బోర్ వేస్తారు. బోర్ వేసిన తర్వాత కాంట్రాక్టర్‌తో పాటు లబ్ధిదారుడైన రైతు సమక్షంలో జియో ట్యాగింగ్ చేసి డిజిటల్ ఫోటో తీసి ప్రభుత్వానికి పంపిస్తారు. బోర్లు వేయడంతో మోటార్లను కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. ఈ పథకం గురించి ఏవైనా సలహాలు ఇవ్వాలనుకున్నా, ఫిర్యాదులు చేయాలనుకున్నా 1902 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయవచ్చు. రైతులు దరఖాస్తు నెంబరును దాచి పెట్టుకోవాలి. మీ దరఖాస్తు స్థితిని వైఎస్సార్ జలకళ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. విడతల వారీగా అర్హులైన రైతులందరికీ ఉచితంగా ప్రభుత్వం బోర్లు వేయిస్తుంది.