తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు పై శరవేగంగా అడుగులు వేస్తున్నారు వైఎస్ షర్మిల. ఈ నేపథ్యంలో మరో కీలక అడుగు వేశారు. తెలంగాణలోని పరిస్థితులు, పాలనా వ్యవహారాలపై అవగాహన ఏర్పరుచుకునే ప్రయత్నంలో ఉన్నారు. అందుకోసం ఆమె సన్నిహితులు, తెలంగాణాలోని ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారు. తాజాగా లోటస్ పాండ్ లో ఈరోజు నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళనంలో హైదరాబాద్, రంగారెడ్డికి చెందిన వైఎస్సార్ అభిమానులతో షర్మిల భేటీ కానున్నారు.
ఈ సమావేశానికి దాదాపు 500 మందిని ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది. పార్ట్ ఏర్పాటుపై వారి నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సమావేశానికి భారీగా అభిమానులు, నేతలు తరలివస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే జై తెలంగాణ నినాదంతో షర్మిల తన ప్రసంగాన్ని ప్రారంబించారు.
ఇప్పటికే నల్గొండ జిల్లాలోని ముఖ్య నేతలతో షర్మిల భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారంతా షర్మిలకు మద్దతు తెలిపారని సమాచారం. ఇక పార్టీ ప్రకటనకు ముందుగానే మిగిలిన జిల్లాల్లో కూడా పర్యటించి వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలనే ఆలోచనలో షర్మిల ఉన్నారట.