తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ నేపథ్యంలో సోదరుడు జగన్మోహన్ రెడ్డితో విబేధాల కారణంగానే ఆమె కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. కాగా ఈ వార్తలకు వైఎస్ షర్మిల చెక్ పెట్టారు. భారీ ఉత్కంఠ అనంతరం మొదటి సారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై షర్మిల స్పందించారు. తెలంగాణలో రాజన్న రాజ్యం రాబోతుందని షర్మిల తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ లో నల్గొండ జిల్లా ముఖ్య నేతలతో ఏర్పాటు చేసిన సమావేశం తర్వాత షర్మిల మీడియాతో మాట్లాడారు. ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పని అయన చేసుకుంటున్నాడు.. తెలంగాణ కోసం అంకితభావంతో పని చేయాలని నేను భావిస్తున్నా ఇక్కడ నా పని నేను చేసుకుంటానని ఆమె పేర్కొన్నారు.
కాగా పార్టీపై షర్మిల చాలా సూత్రప్రాయంగా ముందుకు వెళుతున్నట్టుగా సమాచారం అందుతుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికిప్పుడు పార్టీ ప్రకటించే అవకాశం ఉండకపోవచ్చని భావిస్తున్నారు. షర్మిల వెల్లడించినట్టుగా ముందుగా క్షేత్ర స్థాయిలో పర్యటించి ఆయా జిల్లాల నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశాల అనంతరం పార్టీకి సంబందించిన కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీ ఏర్పాటు కోసం షర్మిల ఓ న్యాయవాది ద్వారా ఈసీని సంప్రదించారని తెలుస్తుంది.