logo

  BREAKING NEWS

చంద్ర‌బాబు స‌వాల్‌కు సై అంటున్న జ‌గ‌న్‌..? రెఫ‌రెండంకు సిద్ధం.?  |   టీడీపీ – వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య చిచ్చుపెట్టిన ఆష్టాచెమ్మా ఆట‌..!  |   తెలంగాణ‌లో మ‌రో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి క‌రోనా పాజిటీవ్‌  |   పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. మ‌ళ్లీ కుర్చీలోకి..!  |   ఆవిరి పీలిస్తే క‌రోనా వైర‌స్ చ‌నిపోతుందా..? అస‌లు నిజం ఇది..!  |   బ్రేకింగ్: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్!  |   బోది ధ‌ర్ముడిని చంపేశారా..? మ‌రి సైనికుడికి క‌నిపించింది ఎవ‌రు..?  |   విశాఖ షిప్ యార్డు బాధితులకు భారీ సాయం ప్రకటించిన ప్రభుత్వం  |   రాజధానిపై ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు..!  |   బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్య‌వ‌ర్గాన్ని ప్ర‌క‌టించిన బండి సంజ‌య్‌  |  

జ‌గ‌న్ బిగ్ యూట‌ర్న్‌.. కానీ ష‌ర‌తులు వ‌ర్తిస్తాయట‌..!

నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ అంశంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వెన‌క‌డుగు వేశారు. ఆయ‌న‌ను రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా పున‌ర్నియ‌మిస్తూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం అర్థ‌రాత్రి కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ఉత్త‌ర్వుల ఆధారంగా సోమ‌వారం నాడు నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌బోతున్నారు. అయితే, ఏదైనా నిర్ణ‌యం తీసుకుంటే మొండిగా ముందుకు వెళ్లే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఇప్పుడు వెన‌క‌డుగు వేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

చంద్ర‌బాబు హ‌యాంలో ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా నియ‌మితులైన నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్‌కు, రాష్ట్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు దూరం పెరిగిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించ‌కుండా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను వాయిదా వేయ‌డంతో నిమ్మ‌గ‌డ్డ‌పై జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌ర్వాత నిమ్మ‌గ‌డ్డ కూడా కౌంట‌ర్ ఇవ్వ‌డం, రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తూ కేంద్రానికి లేఖ రాయ‌డం తెలిసిందే. దీంతో ఆయ‌న ప‌ద‌వీకాలాన్ని త‌గ్గించి, కొత్త అర్హ‌త‌లు పెంచి నిమ్మ‌గ‌డ్డను ఈ ప‌ద‌వి నుంచి జ‌గ‌న్ ప్ర‌భుత్వం త‌ప్పించింది.

కొత్త క‌మిష‌న‌ర్‌గా త‌మిళ‌నాడుకు చెందిన విశ్రాంత జ‌డ్జి క‌న‌గ‌రాజ్‌ను నియ‌మించింది. ఈ విష‌య‌మై నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ హైకోర్టుకు వెళ్ల‌గా ఆయ‌న‌నే తిరిగి ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా నియ‌మించాల‌ని కోర్టు సూచించింది. ఇదే స‌మ‌యంలో రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నియామ‌కం అనేది రాష్ట్ర ప్ర‌భుత్వం చేతిలో ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ పాయింట్ ఆధారంగా త‌మ చేతిలో అధికారం లేక‌పోతే తాము ఎలా ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌ను నియ‌మించ‌గ‌ల‌మ‌ని, గ‌తంలో చంద్ర‌బాబు ఎలా నియ‌మించార‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం అంటోంది.

హైకోర్టు తీర్పుపై క్లారిటీ ఇవ్వాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం సుప్రీం కోర్టును ఆశ్ర‌యించింది. సుప్రీం కోర్టులో కేసు న‌డుస్తోంది. ఇంత‌లో హైకోర్టు ఆదేశాల‌ను అమ‌లు చేస్తూ నిమ్మ‌గ‌డ్డ‌ను పున‌ర్నియ‌మించాల‌ని గ‌వ‌ర్న‌ర్ కూడా రాష్ట్ర ప్ర‌భుత్వానికి లేఖ రాశారు. మ‌రోవైపు హైకోర్టు తీర్పును ప్ర‌భుత్వం ధిక్క‌రిస్తోంద‌నే మ‌రో ఫిర్యాదు కోర్టుకు వెళ్లింది. సుప్రీం కోర్టులో ఇప్పుడే ఈ విష‌యంలో తీర్పు వ‌చ్చే అవ‌కాశం లేదు. వీట‌న్నింటి నేప‌థ్యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఒక‌డుగు వెన‌క్కు వేసి నిమ్మ‌గ‌డ్డ‌ను ఎస్ఈసీగా పున‌ర్నియ‌మించింది.

అయితే, సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్ర‌భుత్వం వేసిన స్పెష‌ల్ లీవ్ పిటిష‌న్‌పై వ‌చ్చే తీర్పుకు లోబ‌డి ఉంటామ‌ని సైతం ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. అంటే, ఇప్ప‌టికైతే గ‌వ‌ర్న‌ర్ మాట‌, హైకోర్టు తీర్పు ప్ర‌కారం నిమ్మ‌గ‌డ్డ‌ను రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా ప్ర‌భుత్వం పున‌ర్నియ‌మించింది. ఒక‌వేళ సుప్రీం కోర్టులో ప్ర‌భుత్వానికి అనుకూలంగా తీర్పు వ‌స్తే మ‌ళ్లీ నిమ్మ‌గ‌డ్డ‌ను తొల‌గించే అవ‌కాశాలూ ఉన్నాయి. అయితే, తాత్కాలికంగా మాత్రం ఈ వివాదం ముగిసిన‌ట్లే.

Related News