logo

మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి

అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి వ‌రుస‌గా సంక్షేమ ప‌థ‌కాలు ప్రారంభించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇటీవ‌ల కొంచెం స్పీడ్ త‌గ్గించారు. క‌రోనా తెచ్చిపెట్టిన ఆర్థిక క‌ష్టాల వ‌ల్ల కొన్ని రోజులుగా కొత్త ప‌థ‌కాల‌ను ప్రారంభించ‌డం లేదు. ఇంత‌కుముందే ప్రారంభించిన ప‌థ‌కాల‌నే అమ‌లు చేస్తున్నారు. ఇప్పుడు మాత్రం ఒక కొత్త ప‌థ‌కానికి జ‌గ‌న్ శ్రీకారం చుట్ట‌బోతున్నారు. అయితే, ఈ ప‌థ‌కం ప్ర‌జ‌ల కోసం కాదు. పాడి ప‌శువుల కోసం.

మూగ‌జీవాల‌కు ఎటువంటి ఆప‌ద వ‌చ్చినా వెంట‌నే చికిత్స అందించిన వాటి ప్రాణాలను కాపాడేందుకు జ‌గ‌న్ కొత్త కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తున్నారు. 108 ఆంబులెన్సుల త‌ర‌హాలో ప‌శువుల కోసం డాక్ట‌ర్ వైఎస్సార్ సంచార ప‌శు ఆరోగ్య సేవా ర‌థాల‌ను సిద్ధం చేస్తోంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం. మ‌నుషుల‌కు ఎలాంటి ఆప‌ద వ‌చ్చినా వెంట‌నే వెళ్లి వారి ప్రాణాల‌ను కాపాడే 108 ఆంబులెన్సులు, 104 మొబైల్ ఆసుప‌త్రుల లాగానే మూగ‌జీవాల కోసం ఈ కొత్త వాహ‌నాలు ప‌ని చేయ‌నున్నాయి.

ముందుగా మైదాన ప్రాంతాల్లో నియోజ‌క‌వ‌ర్గానికి రెండు, గిరిజ‌న ప్రాంతాల్లో నియోజ‌క‌వ‌ర్గానికి ఒక‌టి, న‌గ‌రాల్లో ఒక్కో కార్పొరేష‌న్‌కు ఒక‌టి చొప్పున ఈ వాహ‌నాల‌ను కేటాయించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. మొత్తం 340 ఈ మొబైల్ ఆంబులేట‌రీ క్లినిక్స్ ఇప్ప‌టికే త‌యార‌వుతున్నాయి. ఈ నెల‌లోనే జ‌గ‌న్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి. ఒక్కో వాహ‌నం త‌యారీకి ప్ర‌భుత్వం దాదాపుగా 37 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తోంది.

ఈ వాహ‌నాల్లో ఒక డ్రైవ‌ర్ క‌మ్ అటెండ‌ర్‌, ఒక కాంపౌండ‌ర్ క‌మ్ ల్యాబ్ టెక్నీషియ‌న్‌, ఒక వైద్యుడు అందుబాటులో ఉంటారు. దాదాపు 35 ర‌కాల వైద్య ప‌రీక్ష‌లు కూడా ఈ వాహ‌నంలోనే చేసేలా చిన్న‌పాటి ల్యాబ్‌ను కూడా ఇందులో ఏర్పాటు చేస్తున్నారు. ఈ వాహ‌నాల్లోనే వెళ్లి అక్క‌డిక‌క్క‌డే ప‌శువుల‌కు అవ‌స‌ర‌మైతే స‌ర్జ‌రీలు కూడా చేసేలా రూపొందించారు. 24 గంట‌ల పాటూ ఈ ఆంబులెన్సులు ప‌ని చేస్తాయి. 1962 టోల్ ఫ్రీ నెంబ‌రుకు ఫోన్ చేస్తే అర‌గంట లోపు ఆంబులెన్స్ వ‌చ్చే వ్య‌వ‌స్థ‌ను త‌యారుచేస్తున్నారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆలోచ‌న‌తో ఈ వెట‌ర్న‌రీ ఆంబులెన్సులు ప్రారంభానికి సిద్ధ‌మ‌య్యాయి.

Related News