కృష్ణ జిల్లా గన్నవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విభేదాలకు పుల్‌స్టాప్ పెట్టేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నించారు. ఇవాళ కృష్ణ జిల్లా కంకిపాడులో జరిగిన విద్యా దీవెన కార్యక్రమం ప్రారంభోత్సవానికి జగన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, నియోజకవర్గ వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు కూడా వచ్చారు.
జగన్ సభ ముగించుకొని బయటకు వెళుతుండగా వీరిద్దరితో కాసేపు మాట్లాడి, ఇద్దరి చేతులు కలిపారు. కలిసి పని చేయాలని ఆయన ఇద్దరు నేతలకు సూచించారు. గత ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై టీడీపీ తరపున వల్లభనేని వంశీ పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత వంశీ వైసీపీలోకి రావడంతో నియోజకవర్గంలో గొడవలు మొదలయ్యాయి.
యార్లగడ్డ వెంకట్రావు, వంశీకి ఏ మాత్రం పడటం లేదు. మరో వైసీపీ కీలక నేత దుట్టా రామచంద్రరావుతో సైతం వంశీకి విభేదాలు మొదలయ్యాయి. దీంతో నియోజకవర్గ వైసీపీ మూడు వర్గాలుగా చీలిపోయింది. ఇటీవల తరచూ వైసీపీ క్యాడర్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయాలను వంశీ, యార్లగడ్డ ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఇద్దరికీ నచ్చజెప్పారు. మరి ఇప్పటికైనా ఇద్దరూకలుస్తారో, లేదో చూడాలి.