తమ పిల్లలను చదివించాలన్న ఆరాటం ఉన్నా చదివించలేని పరిస్థితుల్లో పేద తల్లిదండ్రులు ఉన్నారని, పెద్ద చదువులు చదువుకోవాలని ఉన్నా, చదువులు అందని పరిస్థితుల్లో పేద పిల్లలు ఉన్నారని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన ఏడాది పాలనలో విద్యా రంగంపై మన పాలన – మీ సూచన కార్యక్రమాన్ని నిర్వహించారు. పేదల బ్రతుకులు మారాలంటే చదువు ఒక్కటే మార్గమని, పేద కుటుంబాల్లో ఎవరో ఒకరు డాక్టర్, ఇంజనీరింగ్ వంటి పెద్ద చదువులు చదివితేనే పేదరికంలో నుంచి ఆ కుటుంబం బయటపడుతుందని పేర్కొన్నారు. పిల్లలు పెద్ద ఉద్యోగాలు చేస్తే వారు కనీసం పేదరికం నుంచి మధ్యతరగతికి అయినా చేరతారని అన్నారు.
పేద పిల్లలను చదివించలేకపోతే వారి కుటుంబాలు ఎప్పటికీ పేదరికంలోనే ఉండిపోతాయని జగన్ పేర్కొన్నారు. ఏపీలో 45 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, అన్ని తెలుగు మీడియం పాఠశాలే అని అన్నారు. ఇవన్నీ శిథిలావస్థకు చేరాయని, కనీస వసతులు కూడా లేవన్నారు. అందుకే నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచే 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతామని తెలిపారు.
తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని పేద తల్లిదండ్రులు కోరుకుంటున్నారని జగన్ చెప్పారు. 96 శాతం మంది తమ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలని చెప్పినట్లు తెలిపారు. అయినా ఇంగ్లీష్ మీడియం విద్యను చెడిపోయిన రాజకీయ వ్యవస్థ అడ్డుకుంటోందన్నారు. అసెంబ్లీలో ఒక మాట మాట్లాడతారని, బయట మాత్రం వేరే మాట్లాడతారని ఆయన ఆరోపించారు. పేదలు తెలుగును గౌరవించాలి కానీ వారి పిల్లలను మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారని ప్రతిపక్ష నేతలపై విమర్శలు గుప్పించారు. కోర్టులకు వెళ్లి ఇంగ్లీష్ మీడియాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇంగ్లీష్ మీడియం కోసం సుప్రీం కోర్టుకు వెళతామని ఆయన స్పష్టం చేశారు.