అమరావతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో రాజధానికి సంబంధించి జగన్ స్పందించారు. పెట్టుబడులన్నీ ఒకే ప్రాంతంలో పెట్టవద్దని, అలా చేస్తే ఒకే ప్రాంతం అభివృద్ధి చెందుతుందని జగన్ అన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు జగన్ చెప్పారు.
అమరావతి భూకుంభకోణంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోందని, దర్యాప్తులో బినామీలంతా బయటపడటం ఖాయమని జగన్ పేర్కొన్నారు. రాజధాని కోసం వేల ఎకరాలు, లక్షల కోట్లు అనవసరం అని సీఎం జగన్ జాతీయ మీడియాతో అన్నారు. అమరావతిపైన అన్ని కోట్లు ఖర్చు పెడితే ఆదాయం సృష్టించడం సంగతి పక్కన పెడితే కనీసం అప్పు చేసి కేటాయించిన నిధులకు వడ్డీ కూడా కట్టలేని పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు.
మూడు రాజధానులపై తమ నిర్ణయానికి రాష్ట్ర ప్రజలంతా మద్దతు ఇస్తున్నారని, కేవలం 29 గ్రామాలకు చెందిన 10 వేల మంది మాత్రం వ్యక్తిగత కారణాల వల్ల వ్యతిరేకిస్తున్నారని జగన్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపైన స్పందించిన జగన్ ఆధారాలు చూపాలని చంద్రబాబును డీజీపీ కోరితే చూపలేకపోయారని అన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ ఫోన్లను ట్యాప్ చేశారని, అప్పుడు తాము అధారాలు బయటపెట్టామని గుర్తు చేశారు.