అమరావతి, మూడు రాజధానుల ఏర్పాటుపై ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత 270 రోజులుగా అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని అమరావతిలో రైతులు, ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నా జగన్ మాత్రం ఈ అంశంపై తన అభిప్రాయాన్ని ఏ మాత్రం మార్చుకోలేదు. రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటాయని మరోసారి జగన్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. హిందుస్థాన్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ రాజధానితో పాటు రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మూడు రాజధానులపై జగన్ మాట్లాడుతూ.. చెన్నై, హైదరాబాద్‌లో రాజధాని విధులన్నీ కేంద్రీకరించడం వల్ల ఆంధ్రప్రదేశ్ రెండుసార్లు నష్టపోయిందని జగన్ గుర్తు చేశారు. మరోసారి ఇటువంటి పరిస్థితి రావొద్దనే మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని, అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ కూడా రాజధానిని ఒకే చోట కేంద్రీకరించవద్దని చెప్పిందని జగన్ పేర్కొన్నారు. టీడీపీ అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ చేసిందని ఆయన మరోసారి ఆరోపించారు.
1990లలో హైదరాబాద్ మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతంలో చేసినట్లుగానే అమరావతిలోనూ టీడీపీ ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిందని చెప్పారు. చంద్రబాబు, ఆయన మనుషులు బినామీల పేరుతో అమరావతి ప్రాంతంలో పేద రైతుల నుంచి కారుచౌకగా భూములను కొనుగోలు చేశారని, తర్వాత రాజధానిని ఈ ప్రాంతంలో ప్రకటించి రైతులను మోసం చేసి భూముల ధరలు పెంచుకున్నారని జగన్ ఆరోపించారు. కేవలం కొందరికి మాత్రమే లాభం చేకూర్చడానికి గత ప్రభుత్వం చేసిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం అమరావతి అని జగన్ అన్నారు.
అభివృద్ధి రాష్ట్రమంతా విస్తరింపజేయాలనేదే తమ ఆలోచన అని ముఖ్యమంత్రి అన్నారు. అభివృద్ధి అంటే పెద్ద నగరాలే ఉండాల్సిన అవసరం లేదని, కేరళలో పెద్ద నగరాలు లేకపోయినా ఆ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే అనేక అంశాల్లో ముందుందని జగన్ గుర్తు చేశారు. అమరావతిని కూడా తామేమీ వదిలేయమని, అక్కడి నుంచి శాసనసభ నడుస్తుందని జగన్ చెప్పారు. మన దేశంలో ఏ అంశంపైన కూడా రెఫరెండమ్ పెట్టే విధానం లేదని, ఒకవేళ ఉండి ఉంటే కచ్చితంగా రాజధాని అంశంపై రెఫరెండమ్ పెట్టే వెళ్లమని జగన్ అన్నారు.
ఒకవేళ రెఫరెండమ్ పెడితే అమరావతిలోని 29 గ్రామాల్లో 10 వేల మంది తప్ప రాష్ట్రంలోని మిగతా ప్రజలంతా తమ నిర్ణయానికి మద్దతు ఇస్తారని జగన్ నమ్మకంగా చెప్పారు. కరోనా విషయంలో చంద్రబాబుతో కలిసి పని చేయాల్సిన అవసరం లేదా అని అడిగిన ప్రశ్నకు జగన్ స్పందించారు. గత 15 నెలలుగా చంద్రబాబు అమరావతి గురించి తప్ప మిగతా ఏ విషయాలు మాట్లాడటం లేదని, కరోనా వచ్చిన మార్చ్ నుంచి ఆయన అసలు రాష్ట్రానికే రావడం లేదని అన్నారు.
ఇక, జాతీయ రాజకీయాలపై తమకు ఏ మాత్రం ఆసక్తి లేదని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం మాత్రమే మేము పని చేస్తామని జగన్ స్పష్టం చేశారు. బీజేపీతో సంబంధాల విషయంలోనూ తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, అందుకే బీజేపీకి తాము అంశాల వారీగా మద్దతు ఇస్తున్నామని జగన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలోని సంక్షోభంపై స్పందించేందుకు జగన్ ఇష్టపడలేదు.