రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. ముందునుంచీ ప్రచారంలో ఉన్న పేర్ల చివరకు లిస్టులో లేవు. ఎవరూ ఊహించని పేర్లు తెర మీదకు వచ్చాయి. అన్నింటికీ మించి ఇద్దరు తెలంగాణ వ్యక్తులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు పంపిస్తుండటం ఆశ్యర్యంగా మారింది. ఇది వైసీపీ నేతలు కూడా ఊహించలేకపోయారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి ఆ పార్టీ కీలక నేత, పార్టీమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డిదే. ఆయన పదవీకాలం ముగియడంతో మళ్లీ ఆయనను రాజ్యసభకు ఎంపిక చేశారు జగన్. ఇక, మరో స్థానాన్ని నెల్లూరు జిల్లాకు చెందిన బీసీ యాదవ సామాజకవర్గం నేత బీద మస్తాన్‌రావుకు జగన్ ఖరారు చేశారు.
ఆయన కొంతకాలం క్రితం వరకు టీడీపీలో ఉండేవారు. 2019లో టీడీపీ తరపున నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. మస్తాన్ రావు వైసీపీలో చేరినప్పుడే రాజ్యసభ అవకాశం ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఈ హామీని ఇప్పుడు నెరవేర్చారు. విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు ఇద్దరూ నెల్లూరు జిల్లాకు చెందిన నేతలే. పైగా ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ కలిసి సీఏ చదువుకున్నారు. ఈ ఇద్దరి పేర్లు ముందునుంచీ రాజ్యసభ రేసులో ఉన్నవే.
ఇక, అనూహ్యంగా తెరపైకి వచ్చారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య. ఈయనది తెలంగాణ. సెప్టెంబర్ 13, 1954న వికారాబాద్ జిల్లా మొయిన్‌పేట మండలం రాళ్ళడుగుపల్లిలో కృష్ణయ్య జన్మించారు. ఎంఏ, ఎంఫిల్‌తో పాటు న్యాయ విద్యను అభ్యసించారు. ఎల్ఎల్ఎంలో గోల్డ్ మెడలిస్టు. విద్యార్థి దశ నుంచే చురుగ్గా ఉద్యమాల్లో పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి ఏపీ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం ఉద్యమాలు నడిపిన కృష్ణయ్యకు రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు ఉంది. 2014లో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో కృష్ణయ్యను తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సైతం చంద్రబాబు ప్రకటించారు. 2018లో కాంగ్రెస్ పార్టీ తరపున మిర్యాలగూడ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు అనూహ్యంగా కృష్ణయ్యను జగన్ రాజ్యసభకు పంపిస్తున్నారు.
మరో స్థానానికి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, జగన్ వ్యక్తిగత న్యాయవాది నిరంజన్ రెడ్డిని ఎంపిక చేశారు. ఈయనది కూడా తెలంగాణ. జులై 22, 1970న అదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలో జన్మించారు. హైదరాబాద్, పూణేలో చదువుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని సీనియర్ న్యాయవాదుల్లో నిరంజన్ రెడ్డి ఒకరు. ఏపీ నుంచి ఇద్దరు తెలంగాణ వ్యక్తులు రాజ్యసభకు ఎన్నిక కానుండటం మాత్రం ఆశ్చర్యకరమనే చెప్పాలి.