ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డికి పక్క రాష్ట్రాల్లోనూ కొంత క్రేజ్ ఉంది. జగన్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు నచ్చి ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తుంటారు. ముఖ్యంగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో జగన్‌కు ఫాలోయింగ్ బాగానే ఉంటుంది. ముఖ్యంగా జగన్‌కు ఈ మధ్య కాలంలో తమిళనాట అభిమానుల సంఖ్య పెరుగుతోంది. అందుకే అప్పుడప్పుడు తమిళనాడులో జగన్ పోస్టర్లు వెలుస్తున్నాయి.
ఇటీవల హీరో విజయ్‌తో పాటు జగన్ ఫోటోలను కూడా విజయ్ అభిమానులు పోస్టర్లు వేయించారు. ఇప్పుడైతే ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి పక్కన జగన్ నిలువెత్తు కటౌట్ తమిళనాడులో దర్శనమిచ్చింది. త్వరలో తమిళనాడు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కటౌట్ హాట్ టాపిక్‌గా మారింది. తమిళనాడు ఎన్నికల్లో జగన్‌కు ఉన్న ఇమేజ్ను అక్కడి పార్టీలు వాడుకోవాలని ప్రయత్నిస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది.
జగన్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో చెన్నైకు తాగునీటి కొరత ఏర్పడింది. అప్పుడు ఇద్దరు తమిళనాడు మంత్రులు వచ్చి చెన్నైకు తాగునీరు పంపించాలని కోరారు. వెంటనే స్పందించిన జగన్ చెన్నైకు నీటి సరఫరా చేయించారు. ఈ పరిణామం తమిళ ప్రజల్లో జగన్ పట్ల ఇష్టం పెంచింది. తమిళనాడు అసెంబ్లీలోనూ జగన్‌కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపిన విషయం తెలిసిందే.
ఒకప్పుడు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు కలిసే ఉండేవి. రాష్ట్ర విభజన జరిగినా చెన్నైతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో చాలామంది తెలుగు ప్రజలు తమిళనాడులో స్థిరపడ్డారు. ఈ రకంగానూ జగన్ ఇమేజ్ వచ్చే ఎన్నికల్లో క్యాష్ చేసుకునేందుకు అక్కడి పార్టీలు ప్రయత్నించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, డీఎంకే అధినేత స్టాలిన్‌తో జగన్‌కు మంచి స్నేహం ఉంది. తన ప్రమాణస్వీకారానికి కూడా స్టాలిన్‌ను జగన్ ఆహ్వానించారు.
ఇటువంటి సమయంలో అన్నాడీఎంకేకు చెందిన ముఖ్యమంత్రి పళనిస్వామి పక్కన జగన్ కటౌట్ దర్శనమివ్వడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ కటౌట్ వెనుక అసలు కథ వేరే ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడులోని ఉల్లందూర్‌పేటలో టీటీడీ వారు కొత్తగా శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగానే అక్కడి స్థానిక అన్నాడీఎంకే ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు కుమారగురు ఈ కటౌట్ పెట్టించాడని సమాచారం. ఏదేమైనా జగన్ కటౌట్ తమిళనాడు పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.