ఏదైనా ఒక రంగంలో సక్సెస్ అయిన వారి బయోపిక్స్ ఈ మధ్య ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. ప్రేక్షకులు కూడా వీటిపైన ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా పలువురు రాజకీయ నాయకుల బయోపిక్స్ కూడా ఇప్పటికే వచ్చాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ తెరకెక్కనుంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో ప్రతీక్ గాంధీ వైఎస్ జగన్ పాత్రలో కనిపించనున్నారు. ప్యాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
గత ఎన్నికల ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌గా యాత్ర అనే సినిమా విడుదలైంది. మహి వి రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. తెలుగు ప్రజలకు మరోసారి వైఎస్సార్‌ను గుర్తు చేసింది యాత్ర. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడే దీనికి సీక్వెల్ కూడా తీస్తానని మహి వి రాఘవ్ ప్రకటించారు. యాత్ర సినిమాలో వైఎస్సార్ మరణం వరకే చూపిస్తారు.
ఆ తర్వాత వైఎస్సార్ కుటుంబంపై కక్షసాధింపు, వైఎస్ జగన్‌పై కేసులు, జైలుకు పంపించడం, అన్నింటినీ ఎదుర్కొని జగన్ పాదయాత్ర చేసిన చారిత్రక విజయం సాధించి ముఖ్యమంత్రి కావడం వంటి పరిణామాలు జరిగాయి. ఇప్పుడు వీటి ఆధారంగానే మహి వి రాఘవ్ యాత్ర సినిమాకు సీక్వెల్‌గా ముఖ్యమంత్రి జగన్ బయోపిక్‌ను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో జగన్ పాత్రకు బాలీవుడ్ హీరో ప్రతీక్ గాంధీ సరిగ్గా పరిపోతారని డైరెక్టర్ భావించారు.
ఇటీవల విడుదలై సంచలన సృష్టించిన స్కామ్ 1992లో ప్రతీక్ గాంధీ నటించిన సంగతి తెలిసిందే. ప్రతీక్‌కు మహి సినిమా స్టోరీ చెప్పడంతో పాటు ప్యాన్ ఇండియా మూవీగా తీస్తున్నట్లు చెప్పడంతో జగన్ బయోపిక్‌లో నటించేందుకు ప్రతీక్ గాంధీ ఓకే చెప్పేసినట్లు తెలుస్తోంది. వైఎస్సార్ మరణం తర్వాత నుంచి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యేవరకు జరిగిన అన్ని పరిణామాలను ఈ సినిమాలో చూపించనున్నారు.
గత ఎన్నికల్లో వైఎస్ జగన్ ఘన విజయం సాధించినప్పుడు కూడా ఆయన బయోపిక్‌పై చర్చ జరిగింది. వైఎస్ జగన్ జీవితంలో సినిమాకు సరిపోయే అన్ని కోణాలు ఉన్నాయని, ఆయన బయోపిక్ తీయాలని ఉందని బాలీవుడ్ టాప్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూడా ప్రకటించారు. ఇప్పుడు మహి వి రాఘవ్ ప్యాన్ ఇండియా మూవీగా జగన్ బయోపిక్ తీయడం ఖాయమైంది. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.