చీమల్ని చెంపేందుకు ప్రయత్నించి ఓ యువతి ఏకంగా ప్రాణాలే పోగొట్టుకుంది. ఈ విషాద ఘటన చెన్నైలోని అమింజికరై ప్రాంతంలో చోటుచేసుకుంది.పెరుమాళ్ ఆలయం వీధికి చెందిన సత్యమూర్తికి భార్య, కుమారుడు ఓ కుమార్తె సంగీత ఉన్నారు. సంగీత చెన్నైలోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తుంది.
కాగా ఆమె శనివారం తన బెడ్ రూమ్ లో చీమలు ఉన్న విషయం గుర్తించి చూసేసరికి చీమల పుట్ట కనిపించింది. తల్లికి ఈ విషయం చెప్పడంతో వాటిని నిప్పు పెట్టి తొలగించాలని సలహా ఇచ్చింది. తల్లి చెప్పినట్టుగానే ఆమె కిరోసిన్ డబ్బాను తీసుకొచ్చి చీమల పుట్టపై చల్లింది. ఓ కాగితానికి నిప్పంటించి చీమల పుట్టపై ఉంచాలనుకుంది. దీంతో ఒక్కసారిగా చీమలన్నీ సంగీత కాలికి చుట్టుకున్నాయి. కంగారులో ఆమె కిరోసిన్ డబ్బాను చేతిలో నుంచి కింద పడిపోయింది.
సంగీత మంటల్లో కాలిపోయింది. ఆమె కేకలు విన్న తల్లి పరిగెత్తుకుని వచ్చి కూతురిని కాపాడే ప్రయత్నం చేయగా ఆమెకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. సంగీతను ఆసుపత్రికి తరలించగా అప్పటికే తీవ్ర గాయాలవడంతో ఆమె కన్నుమూసింది. ఆమె తల్లి పరిస్థితి నిలకడగా ఉంది. చీమలను చంప బోయి ఆమే అగ్నికి ఆహుతి అవ్వడంతో స్థానికంగా ఈ ఘటన విషాదం నింపింది.