జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ బీజేపీ తరపున ప్రచారానికి హైదరాబాద్ నగరానికి వచ్చారు. పాతబస్తీలోని రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగీ మాట్లాడుతూ.. ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేసారు.
వరద బాధితులకు సహాయాన్ని టీఆర్ఎస్ పార్టీ బ్యాంకు ఖాతాలో ఎందుకు వేయలేదని యోగీ ప్రశ్నించారు. పార్టీ కార్యకర్తలకు లబ్ది చేసేందుకే వరద సహాయాన్ని నగదు రూపంలో ఇచ్చారన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని నిజాం వారసులు అడ్డుకుంటున్నారని.. ప్రజలే వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు.
టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు కుమ్మక్కయ్యారన్నారు. కేసీఆర్ ను మరో నిజాం గా యోగీ అభివర్ణించారు. మూసి పరివాహక ప్రాంతాన్ని ఎంఐఎం పార్టీ కబ్జా చేసిందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిస్తే హైదరాబాద్ ను భాగ్య నగరంగా పేరు మారుస్తామన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎన్నో నగరాల పేర్లు మార్చామని హైదరాబాద్ ను భాగ్యనగరంగా మార్చే శక్తి బీజేపీకి ఉందన్నారు.
యూపీలో తమ ప్రభుత్వం 30 లక్షల ఇల్లు కట్టిందని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత మంది పేదవారికి ఇళ్లకు కట్టించి ఇచ్చిందో చెప్పాలన్నారు. బీజేపీ పార్టీ ఆర్టికల్ 370 రద్దు చేసిందని, రామ మందిరాన్ని నిర్మిస్తుందన్నారు. గ్రేటర్ ఎన్నికల్ బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రజలను కోరారు.