గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం ఓ ఆసక్తికర రాజకీయ సంఘటనకు వేదికగా మారింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఇవాళ జరిగింది. అయితే, ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎక్కడైనా టీడీపీ నేతలు ఆవిష్కరిస్తారు. కానీ, తెనాలిలో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
తెనాలిలోని గాంధీచౌక్ వద్ద చాలా ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహం శిథిలావస్థకు చేరింది. దీంతో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాత విగ్రహాన్ని తీసేయించి కొత్త విగ్రహాన్ని తయారు చేయించారు. ఈ విగ్రహాన్ని ఆయన ఇవాళ ఆవిష్కరించి ఎన్టీఆర్కు నివాళులర్పించారు. ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇవ్వడం, కొత్త విగ్రహాన్ని ఏర్పాటుచేసి ఆవిష్కరించడం చర్చనీయాంశమైంది.
ఇటీవల నెల్లూరు జిల్లా కావలిలోనూ ఇటువంటి పరిణామమే జరిగింది. అభివృద్ధి పనుల్లో భాగంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని అధికారులు తొలగించారు. ఈ సంఘటనపై టీడీపీ శ్రేణులు, నందమూరి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, తమకు ఎన్టీఆర్ పట్ల గౌరవముందని, అభివృద్ధి పనులు పూర్తైన తర్వాత అక్కడే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని వైసీపీకి చెందిన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి స్వయంగా బాలకృష్ణకు ఫోన్ చేసి చెప్పారు.