కూతురు పెళ్ళికి డబ్బు సర్దుబాటు కాలేదన్న మనస్తాపంతో ఓ తల్లి ఇద్దరు కూతుర్లతో సహా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని గాంధీ చౌక్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గోపాలపురం ప్రకాష్, గోవిందమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు రాధికా(30), రమ్య(28) ఉన్నారు.
గోవిందమ్మ భర్త బంగారం మెరుగు పెట్టె పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గోవిందమ్మ టైలరింగ్ చేసేది. ఇటీవలే పెద్ద కుమార్తెకు జనగామకు చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. జనవరి 11న పెళ్లి ఫిక్స్ చేసారు. ఇదిలా ఉండగా పెళ్ళికి అవసరమైన డబ్బు సర్దు బాటు కాలేదు.
పెళ్లి సమయం దగ్గర పడుతుండటంతో గోవిందమ్మ మనస్థాపానికి గురైంది. దీంతో బుధవారం భర్త ఇంట్లో లేని సమయంలో ఇద్దరు కూతుర్లతో కలిసి బంగారం మెరుగు పెట్టె రసాయనం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త పని ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చాడు. కుటుంబ సభ్యులు ఎంతకూ తలుపులు తీయకపోవడంతో స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
వారు తలుపులు తెరిచి చూడగా అప్పటికే ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో నెలలో పెళ్లి జరగాల్సిన ఇంట ఇంతటి విషాదం చోటుచేసుకోవడం స్థానికులను కంటతడి పెట్టిస్తుంది.