ప్రేమ పేరుతో ఫేస్ బుక్ లో వల వేసి ఆ తర్వాత వారిపై వేధింపులకు పాల్పడుతున్న వివాహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ చందానగర్ కు చెందిన కుర్ర విజయ భాస్కర్ అనే వ్యక్తి తాను సాఫ్ట్ వేర్ ఉద్యోగినని నమ్మించి 2017 లో సౌజన్య అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి మూడు సంవత్సరాల బాబు ఉన్నాడు.
ఆమెను తన అవసరాల కోసం డబ్బులు తేవాలంటూ వేధింపులకు గురి చేసాడు. ఆ తర్వాత మేనకోడలిపై కన్నేసిన విజయ్ భాస్కర్ ఆమెను పెళ్లి చేసుకోవడానికి భార్యను తల్లిదండ్రులతో కలిసి వేధించడం మొదలు పెట్టాడు. అమ్మాయిలను ట్రాప్ చేయడానికి ఫేస్ బుక్ ను వినియోగిస్తూ ఏకంగా ఆరుగురు యువతులను బురిడీ కొట్టించాడు.
మొదట వారితో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి దగ్గరయ్యేవాడు. ఆ తర్వాత వారి దగ్గర నుంచి భారీగా డబ్బులు గుంజేవాడు. భర్త వ్యవహారం శృతిమించుతుండటంతో భార్య సౌజన్య అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఇతని మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూశాయి. నిందితుడి కుట్రలో మరో ఆరుగురు యువతులు బలయ్యారని పోలీసులు గుర్తించారు. దీంతో విజయ్ భాస్కర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.