జపాన్ దేశస్తులకు పని రాక్షసులని పేరు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎంత ఎక్కువ పని చేస్తే అంత గొప్పవారనే భావం వారిలో నిలిచిపోయింది. పని కోసం మనదేశంలో ఎంతో ముఖ్యమైనవిగా భావించే ఎన్నో కార్యాలను కూడా వారు త్యాగం చేసేస్తారు. పని ఒత్తిడిలో అక్కడి యువతీయువకులకు ప్రేమలో పడే ఆసక్తి ఉండటం లేదట. పెళ్లి చేసుకున్న జంటలైతే భాగస్వామితో ప్రేమను పంచుకోవాలని పిల్లలను కనాలనే ఆలోచన కూడా లేకుండా బతికేస్తున్నారని ఓ సర్వేలో తేలింది. ఒంటి మీదకు 30 ఏళ్ళు వచ్చినా సోలోబతుకే సో బెటరు అంటూ గడిపేవారు అక్కడ అధికమవుతున్నారని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాప్యులేషన్ అండ్ సోషల్ రీసెర్చ్’ సర్వే ఆందోళన వ్యక్తం చేస్తుంది.
ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఆ దేశంపై తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని భావించిన అక్కడి ప్రభుత్వం నెలకు 60 గంటలకు మించి ఓవర్‌టైమ్ చేయడానికి వీల్లేదని నిబంధన కూడా విధించింది. అయినా పని చేయడానికే అలవాటుపడిపోయిన వారు చాలామంది నెలకు వంద గంటలకుపైగా ఓవర్‌టైమ్ చేస్తూనే ఉన్నారు. యువతీ యువకులు ఇలాగే సింగిల్‌గా గడిపేస్తే.. 2060 నాటికి జపాన్ జనాభా 86 మిలియన్లకు పరిమితమైపోతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
వారు పనికోసం త్యాగం చేస్తున్న ముఖ్యమైన వాటిలో నిద్ర కూడా ఒకటి. అయితే జపాన్ వాళ్లు అసలు నిద్రే పోరనేది అబద్ధం. చాలా మంది తాము నిద్ర పోవాలంటే ప్రత్యేక సౌకర్యాలు ఉండాలని, పక్కన ఎవరూ ఉండకూడదని అంటుంటారు. కానీ జపనీయులు అలా కాదు నిద్రపోవడానికి వారు ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తారు. పక్కన పిడుగు పడినా వారు నిద్రను ఆస్వాదిస్తారు. దీనినే జపాన్ భాషలో ఇనుమొరి అని పిలుస్తారు. అంటే నిద్ర పోతూనే మెలుకువగా ఉండటం అని అర్థం. చాలా సందర్భాల్లో ఆ దేశంలో సునామీలు, భూకంపాలు లాంటివి సంభవించినప్పుడు ఈ విధానమే వారికి ఉపశమనం కలిగిచిందని అంటారు.
నిద్రంటే నాలుగు గోడల మధ్య పరుపుపై హాయిగా కాళ్లు చాపుకుని నిద్రపోవడం కాదు. షాపింగ్ చేస్తూ, నడుస్తూ, మెట్లెక్కుతూ, కుర్చీలో కూర్చుని, లిఫ్టుయూలో పై ఫ్లోరుకు వెళుతూ.. ఇలా తీసే కునుకు వారికి సరిపోతుందని ఓ పరిశోధనలో తేలింది. పోతూ పోతూ ఏదైనా గోడ కనబడితే దానికి చేతిని ఆనించి కూడా ఒక కునుకు తీసి వెళ్తారు. క్లాసులో పాఠం వింటూ, మీటింగులో పాల్గొంటూ కూడా వాళ్లు ఇనెమురి చేస్తారు. మనదగ్గర కూడా అట్లా చాలామంది పడుకుంటారు కదా అనొచ్చు. మనదేశంలో ఇలా ఎవరైనా పనిచేస్తూనో, మీటింగ్ మధ్యలోనే, తరగతి గదిలోనూ నిద్రపోతే చిన్నచూపు చూస్తారు.
కానీ జపనీయులను మాత్రం చాలా కష్టపడినట్టు ఉన్నాడు అని చాలా గౌరవంగా చూస్తారట. ఆ దేశంలో రాత్రంతా పనిచేసిన వారు ఇలా ఎక్కడ పడితే అక్కడ సమూహాలుగా నిలబడే కునుకు తీస్తుంటారు. పాదచారులు సైతం ఇనెమురిలో ఉన్నారని వదిలేస్తారట. అయితే ఇనుమూరి అనేది మనం అనుకునే నిద్ర కాదు అది జపనీయులకు మాత్రమే చెందిన ప్రత్యేకమైన నిద్రా విధానం. విశ్రాంతి తీసుకుంటూనే తన వంతు వచ్చినప్పుడు క్రమశిక్షణతో పని చేయడం వారికే సాధ్యం.