logo

  BREAKING NEWS

మాజీ మంత్రి అఖిల ప్రియ కేసులో కొత్త మలుపు!  |   నువ్వు దేవుడివి సామీ.. 1020 మంది చిన్నారుల‌కు ప్రాణాలు పోసిన మ‌హేష్  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌ను టెన్ష‌న్ పెడుతున్న త్రివిక్ర‌మ్‌  |   తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |  

కేంద్రంపై రైతుల దండయాత్ర ఎందుకు? నూతన వ్యవసాయ చట్టాల్లో ఏముంది?

ఐదు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ రైతుల ఆందోళనలతో దద్దరిల్లుతుంది. పంజాబ్, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ నుంచి వేలాదిగా రైతులు ఢిల్లీ సరిహద్దులకు తరలివస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వారు ఆందోళనలు చేపట్టారు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా ఢిల్లీలో అన్నదాతలు నిరసనలు చేపడుతున్నారు. 5 రోజులుగా సరిహద్దుల్లోనే బస చేస్తున్నారు. తమ పోరాటంలో ఏ రాజకీయ నాయకులకు వేదిక ఎక్కే అవకాశం ఇవ్వబోమని తేల్చి చెప్పారు. తమ పోరాటం రాజకీయాలకు అతీతమని.. తమకు మద్దతు తెలిపే సంఘాల నాయకులకు మాత్రమే అనుమతిస్తామంటున్నారు. సెంట్రల్ ఢిల్లీలో నిరసన చేపట్టేందుకు తమకు అనుమతివ్వాలని వారు కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో సింఘు, టిక్రి, ఘజియాబాద్ సరిహద్దుల నంచి ఢిల్లీ లోకి ప్రవేశించేందుకు రైతులు భారీగా తరలివస్తున్నారు. రైతులు నిరాంకారి మైదానంలో ఆందోళన వ్యక్తం చేసేందుకు పోలీసులు అనుమతివ్వగా వారు మాత్రం తమను రామ్ లీలా మైదానంలో కానీ జంతర్ మంతర్ లోకి గాని వెళ్లేందుకు అనుమతివ్వాలని కోరుతున్నారు. దీంతో సింఘు సరిహద్దుల్లో భారీగా కేంద్ర బలగాలు మోహరించాయి. 96 వేల ట్రాక్టర్లతో కోటి ఇరవై లక్షల రైతులు 44జాతీయ రహదారిని చుట్టుముట్టారు. రాజధాని శివార్లలో జరుగుతున్న ఈ రైతుల నిరసన చరిత్రలో సుదీర్ఘమైన రైతాంగ నిరసన యాత్రగా మారింది. ఈనేపథ్యంలో అసలు నూతన వ్యవసాయ చట్టాల్లో ఏముంది? రైతులు చెప్తున్న అభ్యంతరాలేమిటి? అందుకు కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది? అనే విషయాలు తెలుసుకుందాం..

కేంద్ర ప్రభుత్వం నాలుగు నెలల క్రితం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేపట్టారు. కేంద్రం చట్టం చేసిన వ్యవసాయ బిల్లులను పరిశీలిస్తే.. వాటిలో మొదటిది వ్యాపార, వాణిజ్య బిల్లు. ఈ బిల్లు ప్రకారం.. రైతులు తమ పంటలను ఎక్కడైనా, ఎవరికైనా అమ్ముకునే వీలుంది. అంటే పంటల కొనుగోలుకు మార్కెట్లు అవసరం లేదు. పాన్ కార్డు ఉంటె చాలు ఎవరైనా రైతుల పంటను కొనుగోలు చేయవచ్చు. రెండోది రైతుల ధరల హామీ, సేవల ఒప్పందాల బిల్లు. ఈ బిల్లు ప్రకారం.. కాంట్రాక్టు వ్యవసాయానికి చట్టబద్దత కల్పించారు. ఇక మూడోది నిత్యావసరాల సరకుల బిల్లు. అంటే పప్పులు, నూనె గింజలు, నూనెలు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలతో పాటుగా ఇతర ఉత్పత్తులను నిత్యావసర వస్తువుల జాబితా నుంచి తొలగించడం. ఈ బిల్లు ప్రకారం ఈ ఉత్పత్తులను ఎవరైనా ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు.

ఈ మూడు బిల్లును కేంద్రం లోక్ సభలో ప్రవేశ పెట్టి ఆమోదం పొందింది. ఇవి దేశం మొత్తానికి వర్తింపజేసేలా కేంద్రం చట్టం చేసింది. ఈ మూడు వ్యవసాయ చట్టాలను ఏ రకంగా చూసినా రైతులకు, వినియోగదారులకు, రాష్ట్రాలకు నష్టం చేసేవిగానే ఉన్నాయని వ్యవసాయ నిపుణలు పేర్కొంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కొత్త చట్టాలు వస్తే వ్యవసాయ ఉత్పత్తులు, రైతులు అంతా కార్పొరేట్ల కబ్జాలోకి వెళ్లిపోతాయని.. ఇది మొత్తంగా ఆహారభద్రతకు ముప్పు తెస్తుందని.. కార్పొరేట్ సంస్థల చేతికి ఆహార వస్తువులు పూర్తిగా చేరితే ప్రజలకు అవి అందుతాయి కానీ ధరలు మాత్రం ఆ కార్పొరేట్ సంస్థలు నిర్ణయించినట్లుగా ఆకాశాన్నంటుతాయని అభిప్రాయపడుతున్నారు. కేంద్రం మాత్రం వాటిని ఖండిస్తోంది.

నూతన వ్యవసాయ చట్టాలును అమలులోకి తేవడం ద్వారా వ్యవసాయ రంగంలో భారీ విప్లవం తెచ్చినట్టుగా కేంద్రం భావిస్తుంది. ఈ మూడు చట్టాలు పూర్తిగా రైతులకు, వినియోగదారులకు మేలు చేసేవే అని బీజేపీ ప్రభుత్వం చెప్తుంది. దేశంలో ఎక్కడైనా రైతులు ఉత్పత్తులు విక్రయించే అవకాశం ఉందని, ఇ- వర్తకం కూడా చేసుకోవచ్చని అందుకు కేవలం పాన్ కార్డు ఉంటె చాలని చెప్తుంది. ఈ చట్టాలు సన్నకారు రైతులను పూర్తిగా కష్టాల్లోకి నెడతాయని, రైతుల ఆత్మహత్యలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టాల ద్వారా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందదు. కనీస మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోళ్ళని నిలిపివేస్తుందంటున్నారు. కేంద్రం వెంటనే ఈ నూతన చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

కనీస మద్దతు ధర, పంట కొనుగోలుపై ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలని, ఎలక్ట్రిసిటీ ఆర్డినెన్స్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా రైతుల నిరసనలపై స్పందించిన వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్ రైతులతో ప్రభుత్వం ఇప్పటికే మూడు సార్లు చర్చలు జరిపిందని నాలుగోసారి చర్చలకు కూడా సిద్ధమని తెలిపారు. అయితే ఈ చట్టాలు దేశవ్యాప్తంగా వర్తింపజేసినా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపట్టిన రైతులు పంజాబ్ రాష్ట్రం నుంచే అధికంగా ఉన్నారు. ఈ చట్టాలపై విస్తృతమైన చర్చ జరపకపోవడం కారణంగానే దక్షిణాది రైతులు ఈ ఆందోళనలకు దూరంగా అంటున్నారని ఒకసారి ఈ చట్టాలపై అవగాహన ఏర్పడితే వారు కూడా కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

Related News