కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ప్రపంచ ప్రజానీకమంతా ఎదురుచూస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఇంతకాలం వచ్చే సంవత్సరం మే, జూన్ నాటికి కరోనా వ్యాక్సిన్ వస్తుందనే అంచనాలు ఉండగా, ఈ సంవత్సరంలోనే వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధనామ్ ప్రకటించారు. ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు.
కరోనా వైరస్ వ్యాక్సిన్ అభివృద్ధి, ఉత్పత్తి, పంపిణీకి సహకరించుకునేందుకు గానూ ప్రపంచ దేశాలు కోవాక్స్ అనే పేరుతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఈ కూటమి ఆధ్వర్యంలో ప్రస్తుతం తొమ్మిది కరోనా వ్యాక్సిన్ల ప్రయోగాలు తుది దశలో ఉన్నాయి. వీటి నుంచే వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. కాగా, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక ఉత్పత్తి, పంపిణీ కోసం అన్ని దేశాలు పరస్పరం సహకరించుకోవాలని ఆయన సూచించారు.