క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన శరీరం రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటుంది. గుండెకు సంబందించిన వ్యాధులు, స్థూలకాయం, మధుమేహం వంటి జీవన శైలికి సంబందించిన వ్యాధులు దరిచేరవు. అయితే వ్యాయామం ఏ వయసు వారు చేయాలి, ఎంత సేపు చేయాలి, ఇతర రుగ్మతలతో బాధపడుతున్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలపై ఇంకా శాస్త్రీయమైన స్పష్టత లేదు. ఇప్పుడు కరోనా మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరు ఆరోగ్యం, జీవనశైలి, ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెడుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తొలి సారిగా శారీరక శ్రమ పై శాస్త్రీయంగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో ఐదేళ్ల పైన వయసున్న పిల్లలు, గర్భిణులు, వృద్దులు, దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న వారిని ఐదు గ్రూపులుగా విభజించి ఒక నివేదికను తయారు చేసింది. అందులో భాగంగా డబ్ల్యూహెచ్‌వో కొన్ని ముఖ్యమైన అంశాలను పేర్కొంది. రోజుకి 10-12 గంటలు కదలకుండా ఒకే దగ్గర కూర్చుని పని చేసేవారిలో ముందస్తు మరణాలు సంభవించే అవకాశం మిగిలిన వారితో పోలిస్తే 1.5 రేట్లు అధికంగా ఉందని తేలింది.
శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారిలో కిడ్నీ సమస్యలు, అసిడిటీ, బీపీషుగర్, అధిక బరువు సమస్యలు వచ్చే అవకాశం 10 నుంచి 20 శాతం తక్కువగా వున్నట్టుగా గుర్తించారు. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో వ్యాయామం చేయడం ద్వారా గుండెజబ్బు మరణాలు 40 శాతం తగ్గుతాయని వెల్లడించారు. 27.5 శాతం పెద్దలు, 81 శాతం యుక్త వయస్కులు శారీరక శ్రమ చేయడంలేదు. డబ్ల్యూహెచ్‌వో లెక్కల ప్రకారం.. ఐదేళ్ల నుంచి 17 ఏళ్ల లోపు వయసు పిల్లలు శక్తివంతమైన వ్యాయామాలు చేయాలన్నారు. ఎక్కువగా జాగింగ్ లేదా ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి. వారంలో మూడురోజులు కండరాలకు ఎముకలను బలోపేతం చేసే ఎక్సర్సైజులు చేయాలి. దీని వల్ల పిల్లల్లో గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఎముకలు బలపడతాయి.
18 -64 ఏళ్ల మధ్య వయసు గలవారు ప్రతి వారం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు తేలికపాటి నుంచి కఠినతరమైన వ్యాయామాలు చేయడం వలన గుండె జబ్బులు రక్తపోటు కేన్సర్ టైప్–2 డయాబెటీస్ రాకుండా అడ్డుకోవచ్చు. వారానికి కనీసం 75 నిమిషాల నుంచి రెండున్నర గంటల వరకు కఠినమైన వ్యాయామాలు చేయడం వల్ల గుండె జబ్బులు రక్తపోటు కేన్సర్ టైప్–2 డయాబెటీస్ నుంచి బయటపడొచ్చు. వృద్ధులు సైతం 18–64 ఏళ్ళ వయసు కేటగిరీ వారు చేసే వ్యాయామాలన్నీ చేయవచ్చు. వాటితోపాటు వారు వారానికి కనీసం మూడు రోజులు శరీర బ్యాలెన్స్‌కు దోహదపడే ఎక్సర్సైజులు చేయడం మంచిది. ఇలాచేయడం వలన వృద్దులలో అదుపుతప్పి కింద పడిపోయే సమస్యలు దూరం అవుతాయి.
ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని గర్భిణీలు, బాలింతలు వైద్యుల సూచనల మేరకు ప్రతి వారం కనీసం రెండున్నర గంటల వరకు పరిమితమైన ఏరోబిక్స్ చేయాలి. అయితే వ్యాయామం చేసేవారు అవసరమైనంత వరకు మంచినీటిని తాగాలి. కఠినమైన వ్యాయామాలు వీరు చేయకూడదు. వ్యాయామం చేయడం వలన గర్భిణీ స్త్రీలలో ముందస్తు ప్రసవం సమస్య తగ్గుతుంది. బీపీ సమస్యలు ఉండవు.
దీర్ఘకాలిక జీవన శైలి వ్యాధులు ఉన్నవారు వారానికి కనీస గంటన్నర నుంచి ఐదు గంటలపాటు ఏరోబిక్స్ చేయాలి. లేదా వారానికి 75 నిమిషాల నుంచి రెండున్నర గంటలపాటు కఠినతరమైన, శక్తివంతమై ఏరోబిక్స్ చేయాలి. వీటితో పాటుగా అబ్యాలెన్స్ ను అదుపు చేసే వ్యాయామాలు చేయాలి.