సైబర్ నేరగాళ్లు కొత్త పంథాను ఎంచుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా వాట్సాప్‌ను హ్యాక్ చేస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. చాలా తెలివిగా ఓటీపీ మనతోనే చెప్పిస్తూ మన వాట్సాప్లనే హ్యాక్ చేస్తున్నారు సైబర్ మాయగాళ్లు. హైదరాబాద్‌లో కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయి. ఒక్కసారి ఓటీపీ చెబితే మన వాట్సాప్ ఛాట్, కాంటాక్ట్స్, గ్రూపులు, గ్రూపుల్లో సభ్యుల వివరాలు అన్నీ వీరి చేతిలోకి వెళ్లిపోతున్నాయి. సెలబ్రిటీలనే ఈ విధంగా ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు.
ఇలా వాట్సాప్ హ్యాక్ కాకుండా ఉండేందుకు సైబర్ నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. అజ్ఞాత వ్యక్తులు ముందుగా మనకు ఒక ఓటీపీ పంపిస్తారు. వారే మనకు ఫోన్ చేసి.. పొరపాటున నా నెంబర్ బదులు ఓటీపీ కోసం మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను. ఓటీపీ మీ ఫోన్‌కి వచ్చింది. ఆ ఓటీపీ నాకు కొంచెం అర్జంట్. దయచేసి చెబుతారా అని తెలివిగా మనల్ని కోరతారు. వారి మాటలు నమ్మి మన ఫోన్‌కు వచ్చిన ఓటీపీని వారికి చెప్పగానే మన వాట్సాప్ లాగౌట్ అయిపోతుంది.
ఆ తర్వాత సైబర్ నేరగాళ్ల ఫోన్లలో మన వాట్సాప్‌ను లాగిన్ చేసుకుంటారు. ఇలా మన వాట్సాప్ వివరాలు మొత్తం వారికి చేతిలోకి వెళ్లిపోతాయి. తర్వాత అనేక సమస్యలు వస్తాయి. హైదరాబాద్‌లో కొందరు తమకు ఇలా జరిగిందని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకొని ఇలా చేస్తున్నారని తెలుస్తోంది. వాట్సాప్‌ను సైబర్ మాయగాళ్ల వాళ్ల ఫోన్లలో లాగిన్ అయిన తర్వాత వారి కాంటాక్ట్స్, మెసేజెస్, గ్రూప్స్, గ్రూప్ ఇన్ఫో వంటి వివరాలు చూడవచ్చు. వీటి ద్వారా మోసాలకు, బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉంటుంది.
అయితే, ఇది హ్యాకింగ్ కాదని, సోషల్ ఇంజనీరింగ్ ద్వారా వాట్సాప్‌ను మోసగాళ్లు తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని పలువురు సైబర్ నిపుణులు చెబుతున్నారు. మన ఫోన్ నెంబర్లతో వాళ్ల ఫోన్లలో వాట్సాప్‌ను లాగిన్ చేసుకోవడమే వీళ్ల టార్గెట్‌గా కనిపిస్తోంది. కాబట్టి, ఇలా వచ్చే ఓటీపీలను అజ్ఞాత వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో చెప్పవద్దని సూచిస్తున్నారు. ఇలా చెబితే మన వాట్సాప్ నుంచి మనం లాగౌట్ అయిపోయి ఎవరో సైబర్ నేరగాళ్ల లాగిన్ అవుతారని, మోసాలకు పాల్పడతారని చెబుతున్నారు.
నిజానికి ఓటీపీ అనేది ఎక్కడి నుంచి వచ్చినా చాలా ముఖ్యమైనది, సీక్రెట్ కోడ్ లాంటిదని అర్థం. ఓటీపీ అనేది ఎట్టి పరిస్థితుల్లో అజ్ఞాత వ్యక్తులకు చెప్పకూడదు. ముఖ్యంగా ఓటీపీల ద్వారానే ఎక్కువగా బ్యాంకింగ్, ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి. ఏవో మాయమాటలు చెప్పి మన ఫోన్లకు వచ్చే ఓటీపీలు అడిగి మన అకౌంట్ల నుంచి డబ్బులు కాజేస్తారు. ఇప్పటివరకు ఇటువంటి సంఘటనలు అనేకం జరిగాయి. ఇప్పుడు కొత్తగా మన వాట్సాప్‌ను మోసగాళ్లు ఓటీపీ ద్వారా వాళ్ల చేతుల్లోకి తీసుకుంటున్నారు. కాబట్టి, ఓటీపీలు బయటి వ్యక్తులకు చెప్పవద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.