logo

  BREAKING NEWS

క‌డుపులో మంట ఎందుకొస్తుంది ? ఎలా త‌గ్గించుకోవాలి ?  |   ఇక మీ గ‌డ‌ప వ‌ద్ద‌కే బ్యాంకు వ‌స్తుంది.. కొత్త స‌ర్వీసు  |   బ్రేకింగ్‌: తెలుగుదేశం పార్టీ పార్ల‌మెంటు అధ్య‌క్షుల నియామ‌కం  |   ఆ ఛాన‌ల్ ప్రోగ్రాంకు రాక‌పోయి ఉంటే ఎస్పీ మ‌న‌తోనే ఉండేవారా..?  |   బీజేపీ జాతీయ క‌మిటీ నియామ‌కం.. న‌లుగురు తెలుగువాళ్ల‌కు చోటు  |   టీడీపీ, వైసీపీ శ్రేణుల‌ను ఉర్రూత‌లూగించిన ఆ రెండు పాట‌లు పాడింది బాలునే  |   సొంతిల్లు దానం.. స‌మాధిపై ఏం రాయాలో ముందే చెప్పిన బాలు  |   శానిటైజ‌ర్ ఎక్కువ‌గా వాడుతున్నారా..? ఈ ప్ర‌మాదాలు ఉన్నాయి జాగ్ర‌త్త‌..!  |   విషాద వార్త‌… ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఇక లేరు  |   తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |  

ప్లాస్మా దానం అంటే ఏమిటి ? ఎవ‌రు చేయాలి ? ఎలా చేయాలి ?

అన్ని దానాల్లో క‌న్నా ర‌క్త దానం మిన్న అని ‌అంటుంటారు. ఎందుకంటే ఆప‌ద‌లో ఉన్న వారికి ర‌క్తాన్ని అందించి ప్రాణాన్ని కాపాడ‌టం కంటే గొప్ప సేవ మ‌రేది ఉండ‌దు. కరోనా మ‌హ‌మ్మారి విల‌య‌తాండ‌వం చేస్తున్న ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో అన్ని దానాల్లో క‌న్నా ప్లాస్మా దానం మిన్న అంటున్నారు వైద్యులు. క‌రోనా బారిన ప‌డి ఆరోగ్యం విష‌మించిన వారి ప్రాణాల‌ను కాపాడేందుకు ప్లాస్మా థెర‌పీ ద్వారా చికిత్స అందిస్తున్నారు. ఇందుకోసం ప్లాస్మా అవ‌స‌రం ప‌డుతుంది. అందుకే వైద్యులు, ప్ర‌భుత్వాలు, సెల‌బ్రిటీలు ప్లాస్మా దానం చేయండి అని కోరుతున్నారు. ఏపీలో అయితే ప్లాస్మా దానం చేసే వారికి రూ.5000 ప్రోత్సాహ‌కం కూడా అందిస్తోంది.

ప్లాస్మా అంటే ఏంటి ?
ర‌క్తంలో ఎర్ర ర‌క్త‌క‌ణాలు, తెల్ల ర‌క్త‌క‌ణాలు, ప్లేట్‌లేట్స్ వంటివి తొల‌గించిన త‌ర్వాత ఉండే ద్ర‌వాన్ని ప్లాస్మా అంటారు. ర‌క్తంలో 55 శాతం దాకా ప్లాస్మా ఉంటుంది. యెల్లో క‌ల‌ర్‌లో ఉండే ప్లాస్మా నీరు, ఎంజైమ్‌లు, రోగ నిరోధ‌క క‌ణాలు, ఇత‌ర ప్రోటీన్ల‌ను క‌లిగి ఉంటుంది. శ‌రీరంలో ర‌క్తాన్ని గ‌డ్డ‌క‌ట్టించ‌డంతో పాటు వ్యాధుల‌ను ఎదుర్కోవడానికి ప్లాస్మా ప‌ని చేస్తుంది.

ప్లాస్మా థెర‌ఫీ అంటే ఏమిటి ?
క‌రోనాను ఎదుర్కోవ‌డంలో మ‌నిషిలోని రోగ నిరోధ‌క శ‌క్తి అనేది కీల‌క పాత్ర పోషిస్తుంది. రోగ నిరోధ‌క శ‌క్తి ఉన్న వారి శ‌రీరంలోకి క‌రోనా వైర‌స్ వెళ్లగానే రోగ నిరోధ‌క క‌ణాలు వైర‌స్‌పై దాడి చేసి నాశ‌నం చేస్తాయి. రోగ నిరోధ‌క శ‌క్తి ఎక్కువ‌గా ఉన్న వారు ఇందుకే క‌రోనా నుంచి వేగంగా కోలుకుంటారు. క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత వైర‌స్‌ను అంతం చేసే రోగ నిరోధ‌క క‌ణాలు వారిలో వృద్ధి చెందుతాయి. అయితే, రోగ నిరోధ‌క శ‌క్తి లేని వారికి క‌రోనా సోకితే వారి ఆరోగ్యం విష‌మిస్తుంది. కాబ‌ట్టి, వీరిలోనూ రోగ నిరోధ‌క క‌ణాల‌ను పెంచితే ప్రాణాల‌ను కాపాడ‌వ‌చ్చు. ఇందుకోసమే క‌రోనాను జ‌యించిన వారి శ‌రీరంలో వృద్ధి చెందిన రోగ నిరోధ‌క క‌ణాల‌తో కూడిన ప్లాస్మాను సేక‌రించి రోగ నిరోధ‌క శ‌క్తి లేని వారి శ‌రీరంలోకి పంపిస్తారు. దీంతో వారిలో కూడా రోగ నిరోధ‌క క‌ణాలు ఏర్ప‌డి వైర‌స్‌ను నాశ‌నం చేస్తాయి. ఈ మొత్తం ప్ర‌క్రియ‌ను ప్లాస్మా థెర‌ఫీ అంటారు.

ఎవ‌రు ప్లాస్మా దానం చేయాలి ?
క‌రోనా వైర‌స్ నుంచి పూర్తిగా కోలుకున్న వారే ప్లాస్మా దానం చేయాల్సి ఉంటుంది. ఒక‌టికి రెండుసార్లు ప‌రీక్ష‌లు జ‌రిపిన త‌ర్వాత క‌రోనా వైర‌స్ ఇక శ‌రీరంలో లేద‌ని వైద్యులు నిర్ధారిస్తారు. రోగ నిరోధ‌క క‌ణాలు స‌రైన స్థాయిలో ఉన్నాయో లేదో ఎలీసా ప‌రీక్ష ద్వారా వైద్యులు తెలుసుకుంటారు. శ‌రీర బ‌రువు క‌నీసం 55 కిలోలు, ర‌క్తంలో హిమోగ్లోబిన్ క‌నీసం 12 ఉండి ర‌క్త‌నాణ్య‌త బాగుండాలి. ఇవ‌న్నీ స‌రిగ్గా చూసుకున్న త‌ర్వాత‌నే ప్లాస్మా సేక‌రిస్తారు. దీర్ఘ‌కాలిక వ్యాధులు ఉన్న వారి నుంచి ప్లాస్మా తీసుకోరు.

ప్లాస్మాను ఎలా సేక‌రిస్తారు ?
ఇది కూడా అచ్చం ర‌క్త దానం లాగానే ఉంటుంది. శ‌రీరంలో నుంచి ర‌క్తాన్ని తీసుకొని అందులో ప్లాస్మాను వేరు చేస్తారు. ఆస్పెరిసెస్ అనే విధానం కూడా ఉంటుంది. ఈ విధానం ద్వారా అయితే సేక‌రించిన ర‌క్తంలో నుంచి ప్లాస్మాను వేరు చేసిన త‌ర్వాత ర‌క్తాన్ని మ‌ళ్లీ శ‌రీరంలోకి పంపిస్తారు. కానీ, ఈ విధానం కోసం కొన్ని ప్ర‌త్యేక యంత్రాలు అవ‌స‌రం ఉంటాయి. ఇవి అన్ని చోట్లా ఉండ‌క‌పోవ‌చ్చు.

ఒక వ్య‌క్తి నుంచి ఎంత ప్లాస్మా సేక‌రిస్తారు ?
ఒక వ్య‌క్తి నుంచి సుమారు 800 మిల్లీ లీట‌ర్ల ర‌క్తాన్ని సేక‌రిస్తారు. ఈ ర‌క్తం నుంచి సుమారు 400 మిల్లీ లీట‌ర్ల ప్లాస్మాను తీసుకునే అవ‌కాశం ఉంటుంది.

ఒక వ్య‌క్తి ప్లాస్మాతో ఎంత మందిని కాపాడొచ్చు ?
రోగ నిరోధ‌క శ‌క్తి లేక క‌రోనా ల‌క్ష‌ణాలు ఎక్కువ‌గా ఉండి, శ్వాస స‌మ‌స్య‌ల‌తో ఆరోగ్యం విష‌మించిన వారికి మాత్ర‌మే ప్లాస్మీ థెర‌ఫీ చేస్తారు. ఇలా బాధ‌ప‌డే వారికి 200 మిల్లీలీట‌ర్ల ప్లాస్మాను ఎక్కిస్తారు. అంటే ఒక వ్య‌క్తి చేసిన ప్లాస్మా దానంతో ఇద్ద‌రు వ్య‌క్తుల ప్రాణాల‌ను కాపాడ‌వ‌చ్చు. ప్లాస్మా ఎక్కించిన త‌ర్వాత కేవ‌లం రెండు రోజుల నుంచి పేషెంట్ కోలుకోవ‌డం ప్రారంభ‌మ‌వుతుంది.

ప్లాస్మా దానం చేస్తే ఏమైనా ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయా ?
ప్లాస్మా దానం చేయ‌డం వ‌ల్ల ఎటువంటి ఆరోగ్య స‌మ‌స్య‌లూ రావు. ఇది కూడా ర‌క్త‌దానం లాంటిదే. ఒక‌సారి ప్లాస్మా దానం చేసేందుకు ర‌క్తం ఇచ్చాక ఆ ర‌క్తం మ‌ళ్లీ మ‌న శ‌రీరంలో ఏర్ప‌డుతుంది. కేవ‌లం ప‌రీక్ష‌లు చేయించుకొని ర‌క్త‌దానం చేసిన‌ట్లుగా చేసి ప్లాస్మాను ఇచ్చి వ‌స్తే ఇద్ద‌రిని కాపాడిన వాళ్ల‌మ‌వుతాం. కాబ‌ట్టి, క‌రోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకు రావాల‌ని అంద‌రూ కోరుతున్నారు.

Related News