పాతబస్తీ పార్టీ ఎంఐఎం ఇప్పుడు జాతీయ పార్టీగా ఎదిగేందుకు క్రమంగా అడుగులు వేస్తోంది. ఒక్కో రాష్ట్రంలో పోటీ చేస్తూ కొన్ని సీట్లు గెలుచుకుంటూ వెళుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో తమ సత్తా నిరూపించుకున్న ఎంఐఎం పార్టీ ఇప్పుడు త్వరలో ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్‌పై కన్నేసింది.
పశ్చిమ బెంగాల్లో ముస్లింల జనాభా సుమారు 30 శాతం ఉంటుంది. కనీసం 50 అసెంబ్లీ స్థానాల్లో ముస్లింల ఓట్లు గెలుపోటములను నిర్ణయిస్తాయి. ఈ క్రమంలో బెంగాల్లో మొదటిసారి పోటీ చేసి సత్తా చాటాలని ఎంఐఎం భావిస్తోంది. అయితే, ఎంఐఎం పోటీ చేస్తే తృణమూల్ కాంగ్రెస్‌కు ఎక్కువగా పడాల్సిన ముస్లిం ఓట్లు చీలి బీజేపీ లాభపడుతుందనే విశ్లేషణలు ఉన్నాయి. ఇటీవల మహారాష్ట్ర, బిహార్‌లోనూ ఇదే జరిగింది.
అయితే, బెంగాల్లో ముస్లిం ఓట్లు చీలకుండా తృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఎంఐఎం పార్టీని టార్గెట్ చేసింది. నవంబర్‌లో ఎంఐఎం పశ్చిమ బెంగాల్ కన్వీనర్ సహా మెజారిటీ నేతలను తమ పార్టీలో చేర్చేసుకొని గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా ఎంఐఎం బెంగాల్ అధ్యక్షుడు అబ్దుల్ కలాంను తమ పార్టీలో చేర్చుకొని అసదుద్దిన్ ఓవైసీకి మరో షాక్ ఇచ్చింది తృణమూల్ కాంగ్రెస్.