రైతు చట్టాలను రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రెండు నెలలుగా రైతులు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. కాగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు తమ ఆందోళనలను ఉదృతం చేశారు. ఈరోజు ఎర్రకోట వద్ద గణతంత్ర వేడుకలు నిర్వహించిన అనంతరం రైతులు అక్కడ నిరసన చేపట్టవలసి ఉంది.
కాగా ఎర్ర కోటలో వేడుకలు ముగియక ముందే రైతులు వేల సంఖ్యలో ఎర్ర కోటను చుట్టుముట్టారు. ఎర్రకోటపై ఉన్న బురుజులపై జెండాను ఎగురవేశారు. వేలాది ట్రాక్టర్లతో ఢిల్లీ వీధుల్లోకి చేరుకున్నారు. ఈ సందర్భంగా రైతులు విధ్వంసం సృష్టించవద్దని సంయమనం పాటించాలని పోలీసులు కోరారు. అయినా వారు వినకపోవడంతో పోలీసులు రైతులపై బాష్పవాయువు ప్రయోగించారు.
రైతుల ఆందోళనల సందర్భంగా దేశరాజధానిలో భారీగా బలగాలు మోహరించాయి. ఢిల్లీ మెట్రో సేవలను అక్కడి ప్రభుత్వం నిలిపివేసింది. రోడ్లపై ఆంక్షలు విధించింది. పోలీసులు రైతులను వెనక్కి పంపే ప్రయత్నాలు చేసిన పరిస్థితులు అదుపు తప్పడంతో వారు కూడా చేతులెత్తేశారు. కాగా ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలపై రైతుల ట్రాక్టర్లపై పూలు చల్లిన ప్రజలు వారికి మద్దతు తెలపడం విశేషం.