మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు గడుస్తున్నా మన గ్రామాలు మాత్రం ఇంకా సమస్యల వలయంలోనే ఉన్నాయి. పల్లె ప్రగతి, గ్రామ స్వరాజ్యం అంటూ ప్రభుత్వాలు ఎన్ని మాటలు చెబుతున్నా గ్రామాలు మాత్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడం లేదు. మన గ్రామాల్లో ఇప్పటికీ సరైన మౌళిక సదుపాయాలు కూడా లేవు. రోడ్లు సైతం సరిగ్గా లేని గ్రామాలు అనేకం ఉన్నాయి. కానీ, కేరళలోని ఓ గ్రామం మాత్రం అభివృద్ధిలో అగ్రపథాన ఉంది.
ఈ గ్రామాన్ని చూస్తే ఇది ఇండియాలోనేనా ? లేదా ఏదైనా అభివృద్ధి చెందిన యూరోపియన్ కంట్రీనా ? అనే అనుమానం వస్తుంది. మన గ్రామాలను కూడా ఇలా అభివృద్ధి చేస్తే ఎంత బాగుంటుంది అనే ఆశ పుడుతుంది. ఇంతలా ఆదర్శంగా తీర్చిదిద్దిన ఈ గ్రామం పేరు కరక్కడ్. కేరళలోని కోజికోడ్ జిల్లాలోని వడకర సమీపంలో ఉంటుంది.
కేరళ ప్రభుత్వం, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలు కలిసి ఈ గ్రామాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇందుకు గానూ రూ.2.80 కోట్లు ఖర్చు చేశారు. ముఖ్యంగా గ్రామంలో వగ్భతానంద పార్కుని చూస్తే అమెరికా, యూరప్‌లోని లొకేషన్లను చూసినట్లు ఉంటుంది. ఇందులో ఓపెన్ స్టేజ్, బాడ్మింటన్ కోర్టు, ఓపెన్ జిమ్, చిన్న పిల్లల పార్కు, టాయ్‌లెట్ ఉంటుంది.
ఈ గ్రామం, పార్కు అభివృద్ధికి సంబంధించిన ఫోటోలను కేరళ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. గ్రామం అభివృద్ధి చేయడానికి ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనే ఫోటోలు కూడా పెట్టారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గ్రామాన్ని ఇలా అభివృద్ధి చేసుకున్న గ్రామస్థులపై, ప్రభుత్వంపై ప్రశంసలు కురుస్తున్నాయి.