జీహెచ్ఎంసీ ఎన్నకల నేపథ్యంలో బీజేపీ పార్టీలోకి వలసలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్ పార్ట్ లోని పలువురు నేతలు కాషాయపు కండువా కప్పుకున్నారు. మరి కొందరు నేతలు త్వరలోనే పార్టీలో చేరనున్నారని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగా..తెలంగాణ ఫైర్ బ్రాండ్ గా పేరున్న మాజీ ఎంపీ విజయశాంతి బీజేపీ గూటికి చేరనున్నారని వార్త హాట్ టాపిక్ గా మారింది.
గత కొన్ని రోజులుగా విజయ శాంతి బీజేపీలో చేరనున్నారని ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో విజయ శాంతి ఢిల్లీ పెద్దలను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అప్పుడే ఆమె బీజేపీ తీర్థం తీసుకుంటారని అంతా ఊహించారు. కానీ అదీ జరగలేదు. తాజాగా ఈ వార్తకు మరింత బలం చేకూరుతుంది.
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ వచ్చిన జేపీ నడ్డాను విజయ శాంతి కలిసారని చర్చ జరుగుతుంది. హైదరాబాద్ లోని తాజ్ కృష్ణాలో వీరిద్దరి మధ్య కీలక భేటీ జరిగిందని చెప్తున్నారు. కాగా ఆదివారం కేంద్ర మంత్రి అమిత్ షా నగరానికి రావడం, ఎన్నికల ప్రచారం నిర్వహించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక అమిత్ షా సమక్షంలోనే విజయశాంతి పార్టీలో చేరనున్నట్టు తెలుస్తుంది. కాగా కొంత కాలంగా ఈ వార్తలను తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఖండిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో ఆమె బీజేపీలో చేరిక నిజమనే క్లారిటీ వచ్చేసింది.