దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమయ్యారు. జగన్‌తో విభేదాల కారణంగానే షర్మిల తెలంగాణలో పార్టీని స్థాపిస్తున్నారని యెల్లో మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. తనకు జగన్ అన్యాయం చేశారని, అందుకే బదులు తీర్చుకోవడానికే షర్మిల పార్టీ పెడుతున్నారని టీడీపీ అనుకూల మీడియా ఒక వాదన వినిపిస్తోంది.
అయితే, ఈ వాదనలో ఏమాత్రం పస లేదని, షర్మిలకు ఇప్పుడు కూడా తన కుటుంబంతో మంచి సంబంధాలే ఉన్నాయని చెప్పే ఒక విషయం బయటకు వచ్చింది. షర్మిల పెడుతున్న కొత్త పార్టీకి ఆమె తల్లి విజయమ్మ అండదండలు పూర్తిగా ఉన్నాయని తెలుస్తోంది. బయటకు కనిపించకుండా షర్మిల కొత్త పార్టీని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సహాయసహకారాలను విజయమ్మ అందిస్తున్నారని సమాచారం.
ఇటీవల షర్మిలను మాజీ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కుమార్ సిన్హా కలిసి తాజా రాజకీయ పరిణామాలు, గత అనుభవాలు, భవిష్యత్ పరిణామాలపై చర్చించారు. ఈ ఇద్దరు అధికారులు వైఎస్సార్ హయాంలో ఆయన పేషీలో కీలకంగా పని చేశారు. ఆ సమయంలోనే వీరికి విజయమ్మతోనే మంచి పరిచయం ఉంది. దీంతో విజయమ్మనే వీరిని షర్మిలకు సహకరించాలని కోరినట్లుగా ప్రచారం జరుగుతోంది.
షర్మిల ఏడాది నుంచే కొత్త పార్టీని స్థాపించాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల వైఎస్సార్‌పై విజయమ్మ నాలో, నాతో వైఎస్సార్ అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకంలో వైఎస్‌తో తనకున్న అనుబంధాన్ని విజయమ్మ గుర్తు చేసుకున్నారు. ఈ పుస్తకాన్ని తెలంగాణలో వైఎస్సార్‌తో పని చేసిన, వైఎస్సార్ వర్గీయులుగా, ఆత్మీయులు, సన్నిహితులుగా ముద్రపడిన ప్రతీ ఒక్కరికీ విజయమ్మ పంపించారు.
ఈ పుస్తకాన్ని చదివిన వారు మళ్లీ వైఎస్సార్‌తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు, మరికొందరు వైఎస్సార్ సన్నిహితులకు ఆయన వాడిన దుస్తులను విజయమ్మ పంపించారు. వైఎస్సార్ దుస్తులు, పుస్తకం పంపించడం ద్వారా విజయమ్మ తెలంగాణలోని వైఎస్ సన్నిహితులకు మరోసారి వైఎస్సార్‌ను గుర్తు చేశారు. ఇలా చేయడం ఇప్పుడు షర్మిలకు రాజకీయంగా బాగా ఉపయోగపడనుంది. కాబట్టి, షర్మిలకు విజయమ్మ ఫుల్ సపోర్ట్ ఉన్నట్లే కనిపిస్తోంది.