క్రేజీ హీరో విజయ్ దేవరకొండ అనవసర వివాదంలో ఉరుక్కున్నారు. ఇటీవల విజయ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. నెటిజన్లు ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. తెలిసీ, తెలియకుండా దేశం, రాజ్యాంగానికి సంబంధించిన విషయాలపై ఇష్టమున్నట్లు మాట్లాడవద్దని హితవు పలుకుతున్నారు. రాజ్యాంగ వ్యవస్థను అవమానించేలా విజయ్ దేవరకొండ కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు.
విషయం ఏదైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం విజయ్ దేవరకొండ స్వభావం. ఈ యాటిట్యూడ్ కూడా ఆయనకు యూత్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడానికి ఒక కారణం. ఇలా అన్ని విషయాలపై తన వైఖరి చెప్పడం వల్ల విజయ్ పలుమార్లు వివాదాలను ఎదుర్కొన్నారు. తాజాగా ఆయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు, ప్రభుత్వం, ఓటింగ్ వంటి అంశాలపై విజయ్ కామెంట్స్ సోషల్ మీడియాలో రచ్చ రాజేస్తున్నాయి.
ఇటీవల ఆయన ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. దక్షిణాది నటులు రాజకీయాల్లోకి ఎక్కువగా వస్తున్నారు కదా.. మీరు కూడా రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి ఉందా అని విజయ్ను ప్రశ్నించారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే అంత ఓపిక లేదని చెప్పిన విజయ్ అసలు ప్రస్తుత రాజకీయ వ్యవస్థనే సరిగ్గా లేదని కామెంట్ చేశారు. అంతటితో ఆగిపోతే ఫర్వాలేదు. కానీ, ఓటింగ్, రాజ్యంగ వ్యవస్థపైన విజయ్ మాట్లాడారు.
అసలు మన దగ్గర ఉన్న ఎన్నికల విధానమే సరిగ్గా లేదని, అందరికీ ఓటు హక్కు ఇవ్వడం సరికాదని విజయ్ అన్నారు. కొందరు డబ్బు, మద్యం తీసుకొని ఓట్లు వేస్తారని, అసలు వారు ఎవరికి ఓటు వేస్తున్నారో, ఎందుకో వేస్తున్నారో కూడా వారికే తెలియదని విజయ్ పేర్కొన్నారు. ఇదే సమయంలో ధనికులకు కూడా ఓటు హక్కు ఇవ్వవద్దని అన్నారు.
మధ్యతరగతి ప్రజలకు, చదువుకున్న వారికి, డబ్బులకు లొంగని వారికి మాత్రమే ఓటు హక్కు ఇవ్వాలన్నారు. ఇందుకు గానూ ఆయన ఓ ఉదాహరణ కూడా చెప్పారు. ఫ్లైట్ ఎవరు నడపాలనేది ఆ ఫ్లైట్‌లో కూర్చునే 300 మంది ఓట్లు వేసి నిర్ణయించరని విజయ్ అన్నారు. అంతేకాదు, మన సమాజంలో మార్పు రావాలంటే నియంతృత్వమే మంచిదని విజయ్ కామెంట్ చేశారు. కానీ, ఆ నియంత మంచివారైతేనే ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పారు.
ఏకంగా ప్రజాస్వామ్య వ్యవస్థ, ఓటు హక్కుపైనే విజయ్ దేవరకొండ కామెంట్స్ చేయడం, నియంత పాలన ఉండాలని చెప్పడం పట్ల కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యం గురించి విజయ్ దేవరకొండకు అవగాహన లేదని, అందుకే అలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు విజయ్ ఇలా ఇష్టమున్నట్లు మాట్లాడే స్వాత్యంత్య్రం కూడా ప్రజాస్వామ్యం ద్వారానే వచ్చిందని గుర్తు చేస్తున్నారు. అనవసర వివాదంలో విజయ్ ఇరుకున్నట్లు కనిపిస్తోంది. ఇది ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.