తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే తాను పార్టీలో ఉండనని ఆయన స్పష్టం చేశారు. తానే కాదు చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఎవరి దారి వాళ్లు చూసుకుంటారని వీహెచ్ పేర్కొన్నారు. పార్టీ కోసం పని చేసే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి వంటి నేతలు పీసీసీ అధ్యక్ష పదవి కోసం పనికిరారా అంటూ ఆయన కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ప్రశ్నించారు.
తెలంగాణ వ్యతిరేకి అయిన రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ పార్టీని ఖతం చేశాడని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా ఖతం చేస్తాడని విమర్శించారు. ఓ వైపు బీజేపీ పెరుగుతుంటే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి కింద తాను పని చేయనని స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలను కూడా మ్యానేజ్ చేస్తున్నారని వీహెచ్ ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 డివిజన్ల బాధ్యతలు తీసుకున్న రేవంత్ ఎన్ని డివిజన్లను గెలిపించారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి డబ్బులు ఎలా వచ్చాయో తేల్చాలని సీబీఐకి లేఖ రాస్తానని వీహెచ్ స్పష్టం చేశారు.