హైద్రాబాద్ వనస్థలిపురంలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తనే హతమార్చిన ఓ ఇల్లాలు భర్త శవాన్ని ఇంట్లోనే పాతి పెట్టింది. ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. వివరాల్లోకి వెలిస్తే.. నగరంలోని పాత బస్తీకి చెందిన నౌసిన్ బేగం అనే మహిళ కు వనస్థలిపురం వివేకానందనగర్ కు చెందిన గగన్ అగర్వాల్ అనే వ్యక్తితో గతేడాది జూన్ లో వివాహమైంది.
గగన్ కు ఇదివరకే వివాహం కాగా రెండేళ్ల క్రితం భార్యతో విడాకులు తీసుకుని నౌసిన్ ను వివాహం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 8వ తేదీ నుంచి గగన్ కనిపించకుండా పోయాడు. దీంతో భార్య నౌసిన్, గగన్ సోదరుడు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త కనిపించకుండా పోయినప్పటి నుంచీ నౌసిన్ ఇంటికి తాళం వేసి పుట్టింటికి వెళ్లిపోయింది. విచారణలో భాగంగా ఆమెను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పింది.
దీంతో ఆమె తీరుపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారించారు. చివరకు భర్తను తానే హత్య చేసినట్టుగా ఆమె అంగీకరించింది. భర్తను హత్య చేసి ఇంట్లోనే గొయ్యి తీసి పాతిపెట్టినట్టుగా వెల్లడించింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. నౌసిన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు భర్తను ఎందుకు చంపాల్సి వచ్చింది అనే విషయంపై నిజానిజాలు తెలుసుకునే పనిలో ఉన్నారు.