కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సొంత నియోజకవర్గంలోనే మరోసారి చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం ఉదయం బాపులపాడు మండలం, మల్లపల్లిలో వంశీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. వచ్చినదారిలోనే వెనుదిరిగి వెళ్లాలంటూ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేసారు. తమ గ్రామంలో 1500 కుటుంబాలు ఉంటె అందులో 400 మందికి మాత్రమే ఇళ్ల పట్టాలు పంపిణీ చేసారని వారు అందోళనకు దిగారు.
దీంతో మల్లపల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్థులను అదుపు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు. అయితే ఎమ్మెల్యే వంశీ గ్రామస్థులను శాంతించాలని కోరారు. అర్హులైన వారందరికీ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. అయినా వారు వినికపోవడంతో కార్యక్రమం పూర్తవకుండానే వంశీ వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వైసీపీ మద్దతు ప్రకటించిన నాటి నుంచీ గన్నవరం నియోజకవర్గం వంశీకి తలనొప్పి వ్యవహారంగా మారింది. గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ ఆ తర్వాత వైసీపీకి తన మద్దతు ప్రకటించి ఆ పార్టీకోసం పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే మొదటి నుంచి వంశీని గన్నవరం నియోజకవర్గం వైసీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయనకు సొంత నియోజకవర్గంలో అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి.
డీసీసీబీ అధ్యక్షుడు యార్లగడ్డ వెంకట్రావు వర్గానికి వల్లభనేని వంశీ వర్గానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇటీవల వంశీ కేసరపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లిన సమయంలోనూ రెండు వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.