మూత్రం ద్వారానే శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్తాయి. కానీ కొంతమందిలో ఈ ప్రక్రియ సాఫీగా జరగకుండా వేధిస్తుంది. మూత్రంలో మంట, పొత్తికపుడులో నొప్పి, మూత్రానికి ఎక్కువసార్లు వెళాల్సి రావడం, మూత్రం రంగు మారడం లాంటివి కనిపిస్తాయి. ఈ సమస్య తీవ్రంగా ఉన్నవారిలో మూత్రంలో రక్తం, చీము వంటివి కనిపిస్తాయి. సాధారణంగా ఇవన్నీ యూరిన్ ఇన్ఫెక్షన్ కారణంగా జరుగుతుంటాయి. కొందరిలో నీరసం, జ్వరం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
కారణాలు:
ముఖ్యంగా వేసవిలో ఈ సమస్యకు కారణం శరీరంలో నీటి శాతం తగ్గిపోవడమే. నీటి శాతం తగ్గి లవణాల గాఢత పెరగడంతో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. మగవారిలోకన్నా ఆడవారిలోనే ఈ సమస్య అధికంగా వేధిస్తుంది. అందుకు కారణం ఆడవారిలో మూత్రాశయ, మలద్వారా నిర్మాణాలు పక్కపక్కనే ఉండటంతో హానికారక బ్యాక్టీరియా మూత్రాశయంలోకి వెళ్లి ఇన్ఫెక్షన్ ను కలుగజేస్తాయి. మన ఆహారపు అలవాట్లు, నీరు తక్కువ తాగడం, కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఈ సమస్య తలెత్తవచ్చు.
90 శాతం మూత్రాశయ ఇన్ఫెక్షన్లకు కోలి అనే బ్యాక్టీరియా కారణమవుతుంది. మన వ్యర్థాలు మూత్రం ద్వారా బయటకు వెళ్ళేటప్పుడు అవి శరీరంలోకి రావు. కానీ పబ్లిక్ టాయిలెట్లను ఉపయోగించే సందర్భాలలో ఈ బ్యాక్టీరియా మనలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లైంగిక చర్యల సమయంలో కూడా ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది.
తగ్గించేదెలా..?
ఈ ఇన్ఫెక్షన్ మరీ అంత ప్రమాదకరమైనదేమీ కాకపోయినా దీని వల్ల కలిగే బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. అందుకే వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం చాలా ముఖ్యం. నీరు, జ్యూస్ ల లాంటివి ఎక్కువగా తాగడం వల్ల ఎక్కువ సార్లు మూత్ర విసర్జన జరుగుతుంది. దాని ద్వారా బ్యాక్టీరియా బయటకు వెళ్తుంది.
శృంగారంలో పాల్గొన్న తర్వాత తప్పనిసరిగా మూత్రవిసర్జన చేయాలి. క్రాస్ బెర్రీ పండ్లను ఎక్కువగా తినడం వల్ల కూడా ఈ సమస్య దూరమవుతుంది. బార్లీ గింజల నీటిని తాగడం వలన ఈ సమస్య సులువుగా తీరిపోతుంది. ఇది కాకుండా సంవత్సరంలో ఒకటి కన్నా ఎక్కువ సార్లు మీరు ఈ ఇన్ఫెక్షన్ బారిన పడుతుంటే వైద్య పరీక్షలు తప్పక చేయించుకోవాలి.