గ్రామాల్లో మనకు కనిపించే పాడి పశువులకు చెవులకు ఒక ప్లాస్టీక్ చెవిపోగు కనిపిస్తుంది. పాడి పరిశ్రమలో ఉన్న వారికి, రైతులకు ఈ చెవిపోగు గురించి కొంత అవగాహన ఉంటుంది. కానీ, ఇతరులకు ఈ చెవిపోగు గురించి, దానికి ఉండే నెంబర్ గురించి తెలియదు. పశువులకు వేసే చెవిపోగులు ఏంటి ? ఎవరు ఇవి వేస్తారు ? వాటి వల్ల పాడి రైతులకు లాభమేంటి ? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మనుషులకు గుర్తింపుగా ఆధార్ కార్డులు ఉన్నట్లే పశువులకు చెవిపోగులు కూడా ఆధార్ కార్డుల లాంటివే. నేషనల్ డెయిరీ డెవెలప్మెంట్ బోర్డు వారు ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఫర్ యానిమల్ ప్రొడక్టివిటీ హెల్త్(ఇనాఫ్) అనే వ్యవస్థను ఏర్పాటు చేసింది. దేశంలోని గేదెలు, ఆవుల సమాచారాన్ని ఒక చోట చేర్చడం, వాటి ఆరోగ్యానికి చర్యలు తీసుకోవడం ఈ సంస్థ బాధ్యతలు.
ఇందులో భాగంగా ప్రతి ఆవుకు, గేదెకు 12 అంకెలతో కూడిన యూనిక్ నెంబర్‌తో కూడిన చెవిపోగును వేయడం ప్రారంభించారు. మనిషికి ఆధార్ నెంబర్ ఉన్నట్లుగానే ఈ నెంబరు ఉంటుంది. ఈ నెంబర్ ముద్రించిన ఒక ప్లాస్టీక్ ట్యాగ్‌ను పశువుల చెవికి వేస్తారు. ఈ నెంబర్ వేసినప్పుడే ఆ ఆవు లేదా గేదెకు సంబంధించి సంపూర్ణ సమాచారాన్ని ఆన్లైన్లోని ఇనాఫ్ వెబ్సైట్లో పొందుపరుస్తారు.
అంటే, ఆ పశువు ఎప్పుడు పుట్టింది, యాజమాని ఎవరు, ఏ జాతికి చెందిన పశువు, ఎన్ని ఈతలు ఈనింది, ఎన్ని పాలు ఇస్తోంది, ఎప్పుడు ఎదకు వస్తుంది, పశువు ఆరోగ్య పరిస్థితి ఏంటి, వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చారా వంటి అనేక విషయాలు ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఈ వివరాలతో కూడిన పశు ఆరోగ్య సంరక్షణ కార్డును పశుపోషకులకు అందిస్తారు.
ఇనాఫ్ వెబ్సైట్లోనూ పశువుల చెవిపోగుకు ఉండే 12 అంకెల నెంబర్‌ను ఎంటర్ చేయగానే ఈ వివరాలు మొత్తం క్షణాల్లో వచ్చేస్తాయి. స్థానికంగా ఉండే పశు వైద్యశాలలకు కూడా ఈ సమాచారాన్ని అనుసంధానం చేశారు. ఈ వివరాల ఆధారంగానే పశువులకు సమయానికి వ్యాధి నిరోధక టీకాలను ఇస్తున్నారు. ఇంకా పశువులకు చెవిపోగులు వేసే ప్రక్రియ జరుగుతోంది.
పశువులకు యూనిక్ నెంబర్ కేటాయించి, చెవిపోగులు వేయడం ద్వారా వాటి అమ్మకాలు, కొనుగోళ్లు కూడా సులువు అవుతాయి. ఆన్‌లైన్‌లోనూ పశువుల వివరాలు తెలుసుకోవచ్చు. వాటి ఆరోగ్యానికి జాగ్రత్తలు తీసుకోవచ్చు. సరైన సమయానికి టీకాలు ఇవ్వొచ్చు. ప్రస్తుతానికి ఆవులు, గేదెలకు ఈ యూనియక్ నెంబర్ చెవిపోగులు వేస్తున్నారు. ఆ తర్వాత మేకలు, గొర్రెలకు కూడా వేసే ఆలోచనతో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.