దుబ్బాక ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న వేళ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఇప్పటివరకు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా దుబ్బాకలో పోటీ ఉంటుందనే అంచనాలు ఉన్న వేళ కాంగ్రెస్ అనూహ్యంగా ప్రధాన పోటీదారుగా మారబోతోంది. టీఆర్ఎస్లో టిక్కెట్ ఆశిస్తున్న చెరుకు శ్రీనివాస్ రెడ్డిని తమ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలపాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు గానూ ఇప్పటికే కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ్మ, చెరుకు శ్రీనివాస్ రెడ్డి మధ్య రహస్య చర్యలు జరిగాయనే ప్రచారం జరుగుతోంది.
మాజీ మంత్రి, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి. టీఆర్ఎస్లో చేరే సమయంలో చెరుకు ముత్యం రెడ్డికి తగిన గుర్తింపు, గౌరవం ఇస్తామని టీఆర్ఎస్ పెద్దలు హామీ ఇచ్చారు. కానీ, ఎటువంటి గుర్తింపు దక్కకముందే ముత్యంరెడ్డి మరణించారు. ఆయన వారసుడిగా శ్రీనివాస్ రెడ్డి రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో దుబ్బాకలో ఆయనకు బలమైన అనుచరవర్గం ఉంది.
దీంతో దుబ్బాక ఉప ఎన్నికలో తనకు టిక్కెట్ ఇవ్వాల్సిందిగా టీఆర్ఎస్ పెద్దలను ఆయన కోరారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తున్నారు. ఆయన అనుచరులు మండలాల వారీగా సమావేశాలు పెట్టి శ్రీనివాస్‌రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. అయితే, దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి సతీమణి సుజాతకు టీఆర్ఎస్ టిక్కెట్ ఖాయమైందనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగినతే కాంగ్రెస్ పార్టీ నుంచైనా పోటీ చేయాలని చెరుకు శ్రీనివాస్‌రెడ్డి భావిస్తున్నారని తెలుస్తోంది. ఆయన త్వరలోనే కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉన్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది.
దుబ్బాకలో కాంగ్రెస్‌కు సరైన అభ్యర్థి లేడు. దీంతో గజ్వెల్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిని పోటీ చేయించాలని అనుకుంది. ఇప్పుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి పార్టీలోకి వచ్చేందుకు అంగీకరిస్తే ఆయనకు టిక్కెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ఏ మాత్రం వెనకాడకపోవచ్చు. ఒకవేళ ఇదే జరిగితే చెరుకు శ్రీనివాస్ రెడ్డి కూడా టీఆర్ఎస్, బీజేపీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది.
దుబ్బాక ఎన్నికను కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ముఖ్యంగా ఆ పార్టీ నూతన ఇంఛార్జి మాణికం ఠాగూర్ దుబ్బాకపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి నేతలకు దుబ్బాక నియోజకవర్గంలోని ఒక్కో మండల బాధ్యత అప్పగించి, వారికి కేటాయించిన మండలాల్లో మెజారిటీ తేవడమే లక్ష్యంగా పెట్టారు. నియోజకవర్గంలోని 148 గ్రామాలకు ఒక్కో ఇంఛార్జిని నియమించారు. ఆలస్యంగా తేరుకున్నా దూకుడుగా వెళుతుండటంతో దుబ్బాకలో కాంగ్రెస్ కూడా రేసులోకి వచ్చేసింది. ఇక దుబ్బాక ఉప ఎన్నికలో త్రిముఖ పోటీ తప్పకపోవచ్చు.