గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. బీజేపీ అనూహ్యంగా సీట్లను పెంచుకోవడంతో టీఆర్ఎస్ పార్టీ కేవలం 150 డివిజన్లలో కేవలం 55 డివిజన్లను మాత్రమే గెలుచుకోగలిగింది. జీహెచ్ఎంసీలో అతిపెద్ద పార్టీగా నిలిచినా మేయర్ పీఠం సొంతం చేసుకోవడానికి కావాల్సిన సీట్లను మాత్రం టీఆర్ఎస్ దక్కించుకోలేకపోయింది. బీజేపీ, ఎంఐఎం పార్టీలకు కూడా మేయర్ పీఠానికి కావాల్సిన సీట్లు రాకపోవడంతో జీహెచ్ఎంసీలో హంగ్ ఏర్పడింది.
జీహెచ్ఎంసీ మేయర్ పదవిని కైవసం చేసుకోవడం టీఆర్ఎస్ పార్టీకి పెద్ద కష్టమేమీ కాదు. ఎంఐఎంతో టీఆర్ఎస్కు స్నేహం ఉన్న విషయం తెలిసిందే. ఎంఐఎం మద్దతు తీసుకుంటే సులువుగానే మేయర్ పీఠం టీఆర్ఎస్కు దక్కుతుంది. అవసరమైతే మేయర్ పదవిని టీఆర్ఎస్, ఎంఐఎం పంచుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఎంఐఎం సహకారంతో మేయర్ పదవిని దక్కించుకోవడం రాజకీయంగా టీఆర్ఎస్కు భారీ నష్టం చేసే అవకాశం ఉంది. ఈ నిర్ణయం వల్ల బీజేపీ మరింత బలోపేతం కావడానికి ఒక మంచి అవకాశాన్ని టీఆర్ఎస్ పార్టీనే ఇచ్చినట్లు అవుతుంది.
హిందుత్వం ఆధారంగా బీజేపీ రాజకీయాలు చేస్తోంది. ఎంఐఎంతో టీఆర్ఎస్కు ఉన్న దోస్తీ గురించి చెప్పి జీహెచ్ఎంసీలో ఓట్లడిగింది బీజేపీ. అందుకే ఎంఐఎంతో తమకు సంబంధం లేదని మంత్రి కేటీఆర్ పదేపదే చెప్పుకోవాల్సి వచ్చింది. ఒక సందర్భంలో అయితే అక్బరుద్దిన్ ఓవైసీని పిచ్చోడని సైతం కేటీఆర్ విమర్శించారు. ఎంఐఎంతో తమకు స్నేహం లేదని ప్రజల్లోకి సిగ్నల్స్ పంపించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేసింది.
ఇప్పుడు మేయర్ పీఠం కోసం టీఆర్ఎస్ ఎంఐఎం మద్దతు తీసుకుంటే బీజేపీ ఈ విషయాన్ని భవిష్యత్‌లో రాజకీయంగా అనుకూలంగా వాడుకొని హిందువుల ఓట్లను తమవైపు మలుపుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ అంతగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో టీఆర్ఎస్ ఎలా మేయర్ ఎన్నికపై ఎలా వ్యవహరిస్తోంది అని బీజేపీ ఎదురుచూస్తోంది.
కానీ, బీజేపీ ఆశలను వమ్ము చేస్తూ ఎంఐఎం మద్దతు లేకుండానే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ వద్ద వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్స్ ఆఫీషియో సభ్యులతో కలిసి 203 ఓట్లు ఉంటాయి. మేయర్ పదవిని దక్కించుకోవాలంటే 102 మంది సభ్యుల అవసరం ఉంటుంది. ఎన్నికకు అందరూ హాజరైతేనే 102 మంది సభ్యుల బలం అవసరం. హాజరైన సభ్యుల సంఖ్య తక్కువగా ఉంటే ఆ కావాల్సిన సభ్యుల సంఖ్య కూడా తగ్గుతుంది.
మేయర్ ఎన్నికకు ఎంఐఎం సభ్యులు డుమ్మా కొడితే ఆ రోజు ఉన్న సభ్యుల సంఖ్యను బట్టి టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని సులువుగా గెలుచుకుంటుంది. అంటే, ఎంఐఎం నేరుగా మద్దతు ఇవ్వకుండా, ఎంఐఎంతో పొత్తు లేకుండా టీఆర్ఎస్ మేయర్ పదవిని కైవసం చేసుకుంటుంది. టీఆర్ఎస్ మేయర్ పదవి దక్కించుకునేందుకు ఎంఐఎం ఇన్‌డైరెక్ట్‌గా సహకరించినట్లు అవుతుంది. కానీ, ఇందుకు ఎంఐఎం ఒప్పుకుంటుందా అనేది చూడాల్సి ఉంది.