మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చేదు ఫలితాలు వచ్చినా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంపీగా ఉన్న భువనగిరి పార్లమెంటు పరిధిలో మాత్రం మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఈ నియోజకవర్గ పరిధిలోని మెజారిటీ మున్సిపాలిటీలలో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలను గెలుచుకుంది. హైదరాబాద్ శివార్లలో కీలకంగా ఉన్న ఆదిభట్ల మున్సిపాలిటీలోనూ మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ సభ్యులు గెలిచారు.
కానీ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కౌన్సిలర్లను తమ పార్టీలో చేర్చుకుంది. దీంతో టీఆర్ఎస్ తరపున మున్సిపల్ ఛైర్పర్సన్గా కాంగ్రెస్ నుంచి గెలిచిన కొత్త ఆర్తిక ప్రవీణ్ గౌడ్ ఎన్నికయ్యారు. కొంతకాలంగా ఆమె టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ మున్సిపల్ ఛైర్పర్సన్గా కొనసాగుతున్నారు.
ఇవాళ అనూహ్యంగా ఆమె భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఆదిభట్ల మున్సిపాలిటీ చేరినట్లయ్యింది. ఛైర్పర్సన్ ఆర్తికతో పాటు మరికొందరు టీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కండువాలు కప్పి ఆహ్వానం పలికారు.