అధికార టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ పార్టీకి రాజీనామా చేశారు. పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేసారు.
ఈ సందర్భంగా అయన ప్రసంగాన్ని కొందరు ఉపాధ్యాయులు అడ్డుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పూల రవీందర్ మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం ఉపాధ్యాయులు ఎంతగానో కృషి చేశారన్నారు. ఎంతో కాలంగా వారి సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి లేకపోతే హైదరాబాద్ లో లో జరిగే మహా ధర్నా రోజున పీఆర్టీయూ కు చెందిన మిగతా ఎమ్మెల్సీలందరితో రాజీనామా చేయిస్తామన్నారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సంభ్యుత్వానికి రాజీనామా చేసినట్టే అని పులా రవీందర్ ప్రకటించారు. ఉపాథ్యాయుల ఒత్తిడి కారణంగానే పార్టీకి రాజీనామా చేస్తున్నానన్నారు. తనకు పార్టీకన్నా పీఆర్టీయునే ముఖ్యమన్నారు. కాగా ప్రభుత్వం 45శాతం పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, సీపీఎస్ విధానం పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎప్పటినుంచో ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. ప్రమోషన్స్, బదిలీల షెడ్యూల్ ప్రకటించి, అన్ని పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.