కరోనా మహమ్మారి ప్రజా ప్రతి నిధులను వణికిస్తోంది. నిత్యం ఎదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజల మధ్య తిరిగే నాయకులు అర్దాంతరంగా కరోనాకు బలి అవుతున్నారు. ఇటీవల తమిళనాడు డీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే మరణించారన్న వార్త మరవకముందే ఇప్పుడు మరో నేత కరోనాతో కన్నుమూశారు. బెంగాల్ రాష్ట్రంలోని తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తమోనాశ్ ఘోష్(60) కరోనా సోకి మరణించారు.
గత నెల ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో ఆసుపత్రిలో చేరారు. కాగా చికిత్స పొందుతున్న సమయంలోనే ఆరోగ్యం విషమించడంతో బుధవారం తుది శ్వాస విడిచారు. ఎమ్మెల్యే మృతితో బెంగాల్ సీఎం మమతా దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ఆయన లేని లోటు పూడ్చుకోలేనిదని అన్నారు. పార్టీ శ్రేణులు, అయన అనుచరులు సైతం విషాదంలో మునిగిపోయారు.
తమోనాష్ ఫాల్తా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు.1998 నుంచి తృణమాల్ కాంగ్రెస్ లో కీలక నాయకుడిగా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ఈ క్రమంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎన్నికయ్యారు.