సినిమాలతో పాటుగా సామాజిక కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొనే హీరో మంచు మనోజ్. ఎలాంటి సమస్య అయినా తన దృష్టికి వస్తే వెంటనే స్పందిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో ఇటీవల దివ్యంగులైన యువత, వృద్ధులకు అండగా ఓ ప్రాజెక్టును మంచి మనోజ్ ప్రారంభించాడు. అందులో భాగంగా ఈరోజు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ని కలుసుకున్నాడు.
తన ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని కోరగా అందుకు కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా తన కల సాకారం కాబోతుందని కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపాడు. గతంలో సినిమాలు మానేస్తున్నానని ప్రకటించిన ఈ యంగ్ హీరో ఇటీవల మళ్ళీ సినిమాలు చేయబోతున్నట్టుగా ప్రకటించాడు.
అందులో భాగంగా భారీగా బరువు తగ్గి ఫాన్స్ కు షాకిచ్చాడు. ప్రస్తతం మంచు మనోజ్ హీరోగా నూతన దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ‘అహం బ్రహ్మాస్మి’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కాన్సెప్ట్ విభిన్నంగా ఉండటంతో దీనిపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. కాగా మంచు హీరో సేవా కార్యక్రమాలపై నెటిజన్లు స్పందిస్తూ అతన్ని అభినందిస్తున్నారు.