సినీ పరిశ్రమలో వారసులుగా ఎంట్రీ ఇచ్చే వారంతా సక్సెస్ అవుతారనే గ్యారెంటీ లేదు. కొంత మంది తమ టాలెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటే మరికొందరు పోటీ పరిశ్రమలో నిలదొక్కుకోలేక వెనుదిరుగుతారు. స్టార్ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్ కుమార్ కు కూడా మొదట్లో చేదు అనుభవం ఎదురైంది. హీరోయిన్ గా వరలక్ష్మి నటించిన సినిమాలు ఆడలేదు.
అయినా ఆమె పట్టువిడవకుండా ప్రయత్నించింది. హీరోయిన్ పాత్రలు కలిసిరాకపోవడంతో విలన్ గా కొత్త అవతారం ఎత్తింది. నెగిటివ్ రోల్స్ లో తన పవర్ ఫుల్ నటనతో సత్తా చాటుతుంది. ఇటీవల కాలంలో టాలీవుడ్ లో కూడా వరలక్ష్మికి మంచి పాత్రలే దక్కాయి. ‘క్రాక్’ సినిమాలో జయమ్మ గా, ‘నాంది’ సినిమాలో లాయర్ గా తన నట విశ్వరూపం చూపింది. దీంతో ఆమెకు మరో బంపర్ అఫర్ తగిలింది. ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది.
త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తిన’కు అనే టైటిల్ ను పరిశీలనలో ఉంచారు. ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ లేడీ పొలిటీషియన్ పాత్రకు వరలక్ష్మిని సంప్రదించారని సమాచారం. మరి మాటల మాంత్రికుడి సినిమాలో లేడీ రోల్స్ కు ఎంతటి ప్రాధాన్యం ఉంటుందో తెలిసిందే. ఈ వార్త నిజమైతే వరలక్ష్మి కెరీర్ మరో స్థాయికి వెళ్తుందని చెప్పడంలో సందేహం లేదు. కాగా త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించి ప్రయత్నాలు సాగుతున్నాయి.