హైవేలలో ప్రయాణించేటప్పుడు టోల్ గేట్లు వస్తున్నాయంటే ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాము. టోల్ గేట్ వద్ద ఆగి టోల్ ఛార్జీలు చెల్లించడం మన సమయాన్ని వృథా చేస్తుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే టోల్ గేట్ల వద్ద కొన్నిసార్లు చాలా సేపు ఆగిపోవాల్సి వస్తుంది. ఇందుకు పరిష్కారంగా ఇటీవల ఫాస్ట్‌ట్యాగ్ అనే కొత్త సదుపాయాన్ని ప్రారంభించిన కేంద్రం జీపీఎస్ వ్వవస్థను తీసుకొచ్చి మొత్తం టోల్ గేట్లనే తీసేయాలని నిర్ణయించింది. ఫాస్ట్‌ట్యాగ్ ఉంటే మనం టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు.
ఫాస్ట్‌ట్యాగ్ వాహనాల కోసం ప్రత్యేకంగా ఉండే రోడ్ నుంచి వెళ్లిపోవచ్చు. టోల్ బూత్ వద్ద ఉండే స్కానర్లు మన వాహనం ఫాస్ట్‌ట్యాగ్ క్యూఆర్ కోడ్‌ను గుర్తిస్తాయి. దీంతో మన ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ నుంచి టోల్ చార్జీలను ఆన్లైన్లోనే తీసేసుకుంటారు. ఈ పద్ధతి వచ్చిన తర్వాత టోల్ గేట్ల వద్ద కొంత రద్దీ తగ్గింది. చాలామంది ఫాస్ట్‌ట్యాగ్ తీసుకొని టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన పని లేకుండా వెళ్లిపోతున్నారు.
అయితే, అసలు దేశంలో టోల్ గేట్లనే తీసేయాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. రానున్న రెండేళ్లలో టోల్ ఛార్జీల వసూలుకు కొత్త విధానం ప్రవేశపెడుతున్నామని, ఆ తర్వాత టోల్ గేట్లను పూర్తిగా తీసేస్తామని ఆయన చెప్పారు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) టెక్నాలజీ ఆధారంగా కొత్త విధానం ఉంటుందని, ఇందుకు గానూ రష్యా ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నట్లు నితిన్ గడ్కరీ తెలిపారు.
కొత్త విధానం అమలులోకి వస్తే అన్ని వాహనాలకు జీపీఎస్‌ను అమర్చుకోవాల్సి ఉంటుంది. మన వాహనాలు ఎక్కడ తిరుగుతున్నాయనే మొత్తం సమాచారం నమోదవుతూ ఉంటుంది. జీపీఎస్ ఆధారంగా టోల్ రోడ్లను వినియోగించుకున్న వాహనదారుల నుంచి నేరుగా టోల్ ఛార్జీలుగా ఆన్లైన్ పద్ధతిలో వసూలు చేస్తారు. ఇందుకు గానూ బ్యాంక్ అకౌంట్లను వాహనాలకు అనుసంధానం చేస్తారు.
ఇప్పుడు కొత్తగా వస్తున్న కమర్షియల్ వాహనాల్లో జీపీఎస్ సిస్టమ్ కంపెనీ నుంచే వస్తోంది. పాత వాహనాలు ఉన్న వారు జీపీఎస్ సిస్టమ్‌ను తమ వాహనాల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే రష్యాలో ఇటువంటి విధానం అమలులో ఉంది. అందుకే రష్యా సహకారంతో మన దేశంలోనూ ఇదే వ్యవస్థను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు చేసే వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత టోల్ ఛార్జీల రూపంలో వచ్చే ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం మన దేశంలో ఏడాదికి సుమారు 24 వేల కోట్లు టోల్ ఛార్జీల రూపంలో వసూలవుతున్నాయి. ఇప్పటివరకు 2 కోట్ల మంది తమ వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్‌ను ఏర్పాటుచేసుకున్నారు.