కరోనా కేసులు నేపథ్యంలో తిరుమలను కంటైన్మెంట్ జోన్ గా అధికారులు ప్రకటించారు. తిరుపతిలోని 48 వార్డులు, తిరుమల నగర్, శెట్టిపల్లి, మంగళం కూడా కంటైన్మెంట్ జోన్లుగా మారాయి. కాగా ఇప్పటివరకు తిరుమలలో కరోనా సోకిన వారి సంఖ్య 84కు చేరుకుంది. ఎపిఎస్పీలో 50 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. అయితే తిరుమలను కంటెయిన్మెంట్ జోన్లుగా ప్రకటించినప్పటికీ శ్రీవారి ఆలయం మాత్రం తెరిచే ఉంటుందని వెల్లడించారు.
లాక్ డౌన్ తర్వాత నిబంధనలను పాటిస్తూ శ్రీ వారి దర్శనానికి అనుమతులు కల్పించారు. అలిపిరి మెట్ల మార్గం దగ్గరే భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. భౌతిక దూరం పాటించే విధంగా పరిమిత సంఖ్యలో దర్శనాలు కల్పిస్తున్నారు. అయితే ఇప్పటివరకు తిరుమలకు వెళ్లిన భక్తుల్లో ఒక్కరికి కూడా కరోనా సోకలేదు. కానీ అక్కడ పనిచేస్తున్న టీటీడీ సిబ్బందికి మాత్రమే కరోనా పాజిటివ్ గా తేలడం విశేషం. అప్రమత్తమైన టీటీడీ అధికారులు తిరుమలను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు.