కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దేశంలో ఒకే రోజు 3 లక్షలకు పైగా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. ఫస్ట్ వేవ్ కంటే రెట్టింపు వేగంతో సెకండ్ వేవ్ కరోనా వ్యాపిస్తోంది. ఫస్ట్ వేవ్‌లో ఒక కుటుంబంలో ఒకరికి కరోనా వచ్చినా మిగతా కుటుంబసభ్యులందరికీ సోకేది కాదు. కానీ, ఈ సెకండ్ వేవ్‌లో మాత్రం ఒక్కరికి కరోనా వస్తే మిగతా కుటుంబసభ్యులందరూ వైరస్ బారిన పడుతున్నారు. అంటే, కరోనా బాధితుడిని కలిసిన వారికి దాదాపుగా వైరస్ వ్యాపిస్తోంది.
అయితే, కరోనా బారిన పడకుండా ఉండాలంటే ఒక సెంటిమెంట్‌ను, మొహమాటాన్ని దూరం చేసుకోవాలి. మొహమాటం వల్లనే చాలామంది కరోనా బారిన పడుతున్నారు. వినడానికి వింతగా ఉన్నా ఇది ముమ్మాటికీ నిజం. మనలో చాలామంది బయటకు వెళ్లినప్పుడు మాస్కులు ధరిస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తున్నారు. శానిటైజర్లు కూడా వాడుతున్నారు. ఇంత జాగ్రత్తగా ఉన్నా కరోనా బారిన పడుతున్న వారు చాలా మంది ఉన్నారు.
దీనికి ప్రధాన కారణం మొహమాటం. బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉంటున్న మనం మన స్నేహితులను, బంధువులను, మనతో పని చేసే కొలిగ్స్‌ను కలిసినప్పుడు మాత్రం మొహమాటం కారణంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఉదాహరణకు మనం మన దగ్గర బంధువులను కలిసినప్పుడు వెంటనే మాస్క్ తీసేస్తున్నాం. మాస్క్ పెట్టుకొని మాట్లాడితే వాళ్లు ఏమనుకుంటారో అనే మొహమాటమే ఇందుకు కారణం.
స్నేహితులను కలిసినప్పుడు కూడా మాస్క్ తీసేసి మాట్లాడుతున్నాం. మనతో పని చేసే వారితోనే మాస్క్ లేకుండానే మాట్లాడుతున్నాం. మాస్క్ పెట్టుకొని మాట్లాడితే వాళ్లు ఏమనుకుంటారో అనే మొహమాటం ఒకటైతే మన వాళ్లే కదా అనే నిర్లక్ష్యం మరో కారణం. ఈ కారణాలతోనే మనలో చాలా మందిమి వైరస్ బారినపడుతున్నాం. మన వాళ్ల దగ్గర నుంచే మనకు వైరస్ వ్యాపిస్తోంది.
కాబట్టి, మనవాళ్లు ఏమనుకుంటారో అనే మొహమాటం, మన వాళ్లే కదా ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యం వీడితే మనం చాలా వరకు కరోనా బారిన పడకుండా ఉంటాము. మన వాళ్లయినా సరే మాస్కులు పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. ఇది మనకే కాదు మన బంధువులు, స్నేహితులు, మన వాళ్లని అనుకునే వారికి కూడా చాలా మంచిది.