అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. భారత్ లో టిక్ టాక్ సహా పలు చైనా యాప్ లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు భారత్ బాటలోనే ట్రంప్ నడుస్తున్నారు. చైనా ఈ యాప్ ల ద్వారా తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడుతుందని ట్రంప్ కు అనుమానం కలుగుతుంది. ఈ విషయంపై అమెరికా ఎంపీలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో టిక్ టాక్ ను నిషేదించాలని స్వరం గట్టిగా వినిపిస్తుంది.
ఈ నేపథ్యంలో ట్రంప్ తాజాగా కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. వైట్ హౌస్ లో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ట్రంప్ టిక్ టాక్ ను నిషేధించే అంశం పై యోచిస్తున్నాము. అదే సమయంలో మా దగ్గర ప్రత్యామ్న్యాయ మార్గాలు సైతం ఉన్నాయి. అవసరమైతే టిక్ టాక్ ను అమెరికా నుంచి నిషేధించడానికి వెనకాడం అంటూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. మొదట బైట్ డాన్స్ నుంచి టిక్ టాక్ కార్యకలాపాలను అమెరికా వేరు చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అక్కడి మీడియాలో వార్తలు వస్తున్న సమయంలో ట్రంప్ ఈ అంశం పై కీలక వ్యాఖ్యలు చేశారు.
కాగా ట్రంప్ ఈ ప్రకటన చేసిన కొద్ది సమయానికే ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ దీనిపై స్పందించడం గమనార్హం. టిక్ టాక్ ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసేందుకు సిద్దమవుతున్నట్టుగా సమాచారం. ఇప్పటికే బైట్ డాన్స్ తో ఈ విషయంపైనా సంప్రదింపులు కూడా జరిపిందని వార్తలు వస్తున్నాయి. కాగా దీనిపై మైక్రోసాఫ్ట్ గాని, బైట్ డాన్స్ గాని అధికారికంగా స్పందించలేదు.
ఇప్పటికే భారత్ లో నిషేదానికి గురవ్వడంతో టిక్ టాక్ మాతృ సంస్థ అయిన బైట్ డాన్స్ భారీగా నష్టపోయింది. చైనాకు యూజర్ల డేటాను చేరవేస్తున్నామని తమపై వస్తున్న ఆరోపణలు నిజం కాదని రుజువు చేసుకునే ప్రయత్నాల్లో ఉండగానే అమెరికా నుంచి మరో షాక్ తగిలింది. అయితే ఈ గూఢచర్యం ఆరోపణలను చైనా ఖండిస్తూ వస్తుంది.