ఫ్రిడ్జ్ అనేది ఒకప్పుడు ధనవంతుల ఇళ్లలో మాత్రమే ఉండేది. కానీ, ఇప్పుడు పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లలో కూడా ఫ్రిడ్జ్‌లు ఉంటున్నాయి. అయితే, ఫ్రిడ్జ్ అయితే ఉంటుంది కానీ దాంట్లో ఏ వస్తువులు పెట్టాలి, ఏ వస్తువులు పెట్టవద్దు అనే విషయాలపై మాత్రం చాలా మందికి అవకాగాహన ఉండదు. తెలిసీ తెలియక అన్ని ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్‌లో పెడుతుంటాం. ఫ్రిడ్జ్‌లో పెడితే పాడవకుండా ఉంటాయనే ఉద్దేశ్యంతో అన్నింటినీ ఫ్రిడ్జ్‌లో పెట్టేయడం చాలా మందికి అలవాటు.
ఫ్రిడ్జ్‌లో పెట్టి రోజుల తరబడి వాడుకోవడం, తినడం కూడా చాలా మంది చేస్తుంటారు. ఇది ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు. ప్రత్యేకించి ఫ్రిడ్జ్‌లో కొన్ని ఆహార పదార్థాలను అస్సలు పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది కోడిగుడ్లు ఒకేసారి ఎక్కువగా కొని ఫ్రిడ్జ్‌లో పెట్టి రోజుల తరబడి వాడుతుంటారు. ఇది అస్సలు మంచిది కాదు. కోడిగుడ్లు ఫ్రిడ్జ్‌లో పెడితే వాటిల్లో బ్యాక్టీరియా ఫామ్ అయ్యి అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది.
అన్ని కూరగాయలతో పాటు ఆలుగడ్డలు కూడా ఫ్రిడ్జ్‌లో పెడుతుంటాం. ఇది కూడా ఆరోగ్యానికి అంత మంచిదేమీ కాదు. ఫ్రిడ్జ్‌లో ఆలుగడ్డలు పెడితే వాటిల్లో చెక్కెర శాతం పెరుగుతుంది. ఆలుగడ్డల సహజ రుచి కూడా మారిపోతుంది. టమాటాలు కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టవద్దు. నిజానికి ఏవైనా ఆహార పదార్థాలు, కూరగాయలు ఫ్రిడ్జ్‌లో పెడితే పాడుకాకుండా ఉంటాయి. కానీ, టమాటలు మాత్రం పాడవుతాయి.
పుచ్చకాయలను కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టవద్దు. ఫ్రిడ్జ్‌లో పెడితే పుచ్చకాయల్లోని యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిపోతాయి. రుచి మారిపోతుంది. తీయగా ఉండాల్సిన కాయ చప్పగా మారిపోతుంది. ఇవే కాదు, పచ్చళ్లు, వెల్లుల్లి, మునక్కాయలు, తేనె, అరటిపండ్లను కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టవద్దు. ఇవి ఫ్రిడ్జ్‌లో పెడితే రుచి మారిపోయి చప్పగా అవుతుంది.