ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై జరుగుతున్న దాడుల ఘటనల నేపథ్యంలో హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆలయాలపై దాడుల ఘటనలపై ముఖ్యమంత్రి జగన్ వైఖరికి నిరసనగా బజరంగ్దళ్ ఇవాళ లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసం ముట్టడికి పిలుపునిచ్చింది. పెద్ద ఎత్తున బజరంగ్దళ్ కార్యకర్తలు జగన్ నివాసానికి ర్యాలీగా చేరుకొని ఆందోళన చేశారు. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బజరంగ్దళ్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నా జగన్ ఎందుకు స్పందించడం లేదని బజరంగ్దళ్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాగా, జగన్ ఇవాళ తిరుమల వెళ్లనున్న నేపథ్యంలో తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డిక్లరేషన్‌పై జగన్ సంతకం చేయాలనే డిమాండ్‌తో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
చంద్రబాబు పిలుపుమేరకు అలిపిరి వద్ద టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. డిక్లరేషన్‌పై జగన్ సంతకం చేయాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. ముందుజాగ్రత్తగా పలువురు టీడీపీ నేతలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. తిరుపతికి చెందిన బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డిని కూడా పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. దీంతో ఆయన తన ఇంటి ముందే ఆందోళన చేశారు.