తెలుగుదేశం పార్టీ మరోసారి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీతో కలిసి సీట్లను పంచుకున్న టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయబోతోంది. అయితే, ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కాదు. కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ ఆండ్ నికోబార్ దివుల్లో. అండమాన్‌లో తెలుగుదేశం పార్టీకి కొంతమేర బలం ఉంది. పైగా ఇక్కడ తెలుగు ప్రజల ప్రాబల్యం కూడా ఎక్కువగానే ఉంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా మార్చాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రచించారు. ఇందులో భాగంగానే అండమాన్ రాజకీయాలపై దృష్టి పెట్టారు. అండమాన్‌లో దాదాపుగా లక్షా యాభై వేల మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాలకు చెందిన వారు. చాలా ఏళ్ల క్రితమే అండమాన్‌లో వీరంతా స్థిరపడ్డారు.
త్వరలోనే అండమాన్ నికోబార్‌లో మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో అండమాన్ రాజధాని పోర్టు బ్లెయిర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కీలకమైనవి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అండమాన్ శాఖ అధ్యక్షుడు రంగలాల్ హల్దార్, టీడీపీ అండమాన్ అధ్యక్షుడు మాణిక్యరావు యాదవ్ చర్చలు జరిపి రెండు పార్టీల పొత్తును ఖరారు చేసుకున్నారు. పోర్టు బ్లెయర్ మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు ఉండగా 2, 5, 16 వార్డుల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు.
అండమాన్ స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం ఇది రెండోసారి. 2015లో కూడా పోర్టు బ్లెయిర్ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసింది. అప్పుడు ఏపీ హోంమంత్రిగా ఉన్న నిమ్మకాయల చినరాజప్ప, మరో నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అండమాన్‌లో ప్రచారం కూడా నిర్వహించారు. ఆ ఎన్నికల్లో మొత్తం 24 సీట్లలో టీడీపీ పోటీ చేసి 2 సీట్లను గెలుచుకుంది. మరో నాలుగు వార్డుల్లో రెండో స్థానంలో, 11 వార్డుల్లో మూడో స్థానంలో నిలిచింది. పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే టీడీపీ ఎంతోకొంత పట్టు నిరూపించుకుంది.
ఈసారి ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది. 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ చరిత్రలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఇది రెండోసారి. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. కానీ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మాత్రం పొత్తు పెట్టుకోలేదు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్‌తో జత కడుతోంది. కానీ, ఇది కేవలం అండమాన్‌కే పరిమితం అయ్యే అవకాశం ఉంది.