ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలనపై తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. ఇవాళ టీడీపీ కార్యాలయంలో ఆయన జగన్ ఏడాది పాలనపై ఛార్జ్‌షీట్ విడుదల చేశారు. విధ్వంసానికి ఒక్క ఛాన్స్ పేరుతో ఆయన ఛార్జ్‌షీట్ విడుదల చేసి జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పాదయాత్రలో ముద్దులు పెడుతూ వెళ్లిన జగన్ ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారని ఆరోపించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చడం లేదని పేర్కొన్నారు. అమ్మ ఒడి పథకాన్ని 83 లక్షల మంది పిల్లలు ఉంటే 42 లక్షల మందికే ఇస్తున్నారని ఆరోపించారు. ఈ పథకానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు కార్పొరేషన్ల నిధులను మళ్లించారని దుయ్యబట్టారు. మద్య నియంత్రణ చేస్తానని చెప్పిన జగన్ ఇప్పుడు జగన్ రెడ్డి మద్యం దుకాణాలు ప్రారంభించారని ఎద్దేవా చేశారు. విషంతో సమానమైన చీప్ లిక్కర్‌ను ప్రజలకు అంటగట్టి వారి పొట్ట కొడుతున్నారని అన్నారు.
చీప్ లిక్కర్‌కు బ్రాండ్ అంబాసిడర్ ముఖ్యమంత్రి జగన్ అని లోకేష్ ఎద్దేవా చేశారు. మద్యం ద్వారా 23 కోట్ల రూపాయాల జే ట్యాక్స్ ప్రజలపై జగన్ వేశారని ఆరోపించారు. రూ.3000 పింఛన్ ఇస్తానని ఎన్నికల ముందు చెప్పిన జగన్ ఇప్పుడు మాట మార్చారని లోకేష్ పేర్కొన్నారు. పింఛన్ పెంచడం లేదని ప్రశ్నించినందుకు కేసులు పెడుతున్నారని అన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో లోకేష్ పూర్తిగా సన్నబడి కనిపించారు. ఆయన మాటతీరులోనూ మార్పు వచ్చింది.