తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ ముందుగా అభ్యర్థిని ఖరారు చేసింది. ఆ పార్టీ తరపున మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీని పోటీ చేయించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. 2019 ఎన్నికల్లోనూ ఆమెనే టీడీపీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 2.28 లక్షల భారీ మెజారిటీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాదరావు విజయం సాధించారు.
పనబాక లక్ష్మీ సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. మూడుసార్లు నెల్లూరు లోక్సభ నుంచి, ఒకసారి బాపట్ల లోక్సభ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు కేంద్రంలో ఆమె మంత్రిగా కూడా పని చేశారు. గత ఎన్నికల ముందు ఆమె కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరి తిరుపతి నుంచి పోటీ చేశారు.
కాగా, తిరుపతి లోక్సభ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థి ఎవరనేది వైసీపీ ఇంకా తేల్చలేదు. దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు కుటుంబసభ్యుల్లోనే ఒకరికి టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ, జనసేన కలిసి ఇక్కడ పోటీ చేయనున్నాయి. ఈ కూటమి తరపున కూడా టిక్కెట్ ఇంకా ఎవరికీ ఖరారు చేయలేదు.